AP and TS / Entertainment
మీసం తిప్పిందెవరు ?
282 days ago

ద రియల్ బాస్ ఈజ్ బ్యాక్.. అంటూ అప్పుడే థియేటర్ బైట యుద్ధం మొదలైంది. రెండు సినిమాలూ ఒకదానికొకటి ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నా.. చివరికి నిలిచేది ఒకటేనన్నది నిజం. ఆ ఒక్కటీ ఏదన్నది కూడా ఈపాటికే తేలిపోయింది. వాస్తవం చెప్పుకోదలిస్తే.. ఖైదీకీ, శాతకర్ణికీ  పోలిక పెట్టడమే తప్పు. థీమ్ లోగాని, థియరీ లో గానీ, టార్గెటెడ్ ఆడియెన్స్ లో గానీ దేనికదే విభిన్నం. పెడితే గిడితే వసూళ్ల దగ్గర మాత్రమే ఈ రెండు సినిమాలకూ పోలిక పెట్టుకోవచ్చు. అందుకే.. ఇప్పుడు సినీ గోయర్స్ దృష్టి మొత్తం బాహుబలి మీదకే మళ్లింది. జక్కన్న బాహుబలినీ, క్రిష్ శాతకర్ణినీ పక్కపక్కన పెట్టుకుని చూసుకోవడం మొదలైంది. 

జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్, కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అలియాస్ జక్కన్న.. వీళ్ళిద్దరూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చినవాళ్లే. ప్రేక్షకుడికి విజువల్ ఫీస్ట్ వడ్డించడం ఎలాగో ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అయితే ఎవరి శైలి వాళ్ళకుంది. హీరోయిజాన్ని వీలైనంత ఎక్కువగా ఎలివేట్ చేయడం, మ్యూజిక్ బీట్స్ కి ప్రయారిటీ పెంచడం లాంటివి రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్. రొమాంటిక్ సీన్స్ లో కూడా  లైన్ దాటకుండా జాగ్రత్తపడ్డం, వల్గారిటీకీ చోటివ్వకపోవడం, అవసరాన్ని బట్టి సామాజిక అంశాల్ని స్పృశించడం.. సాఫ్ట్ కామెడీని మాత్రమే నమ్ముకోవడం.. ఇవీ స్వచ్ఛమైన సినిమా తీయడంలో క్రిష్ కి తోడుండే అంశాలు. కంచె లాంటి మెమరబుల్ సినిమాలతో ఇప్పటికే క్రిష్ ఈ ఘనతను ప్రూవ్ చేసుకున్నాడు. 

 

బాహుబలి.. ఒక ఫాంటసీ.. కల్పితకథ. మార్పులు-చేర్పులు దర్శకుడి చేతుల్లోనే ఉంటాయి. వక్రీకరించారన్న అపవాదులు గానీ, చరిత్రను అవమానించారంటూ కోర్టు కేసులు గానీ ఏమీ వుండవు. పైగా.. ఐటెం సాంగ్ లాంటి కొన్ని వ్యాపారాత్మక అతుకుల్ని పెట్టుకున్నా అడిగేవాళ్ళుండరు.కానీ.. శాతకర్ణి మేకింగ్ దీనికి పూర్తి విరుద్ధం. వెయ్యి జాగ్రత్తలు తీసుకున్నా దొరికిపొయ్యే ఛాన్సులెక్కువ. ఇంత గట్టి ఛాలెంజ్ ని కూడా అలవోకగా ఆర్నెల్లలో ఛేదించిన క్రిష్ ని రిలీజ్ కి ముందే ఆకాశానికెత్తేసింది టాలీవుడ్. 

చరిత్ర నుంచి తీసుకున్న కథావస్తువు గనుక.. మేకింగ్ లో పొల్లు పోకుండా చూసుకోవాలి.. కనీసం ఇక్కడైనా క్రిష్ దొరుకుతాడని క్రిటిక్స్ ఎదురుచూశారు. కానీ.. క్రిష్ వంటకాన్ని, దాన్ని వండిన పద్ధతిని చూసి పెన్నులకు మూతలు బిగించాల్సివచ్చింది.  సినిమా మొత్తాన్ని యుద్ధ సన్నివేశాలతో నింపెయ్యాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో కూడా.. నడుమ ఆసక్తికరమైన కథనం, అద్భుతమైన డైలాగులు సినిమాను ఇరగపండేలా చేశాయని సెలెబ్రిటీ ట్వీట్లు ఎలుగెత్తి చాటేశాయి. బాలకృష్ణ వేషభాషల్లో రాజసం, సన్నివేశాల చిత్రీకరణలో వైభవం.. ఎక్కడా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నది ప్రశంసకుల సారాంశం. వీటన్నిటికీ మించి.. శాతకర్ణి సినిమా బాహుబలిని మరిపించిందన్న ఆ ఒక్క 'కాంప్లిమెంట్' మాత్రం మోస్ట్ రిమార్కబుల్. 

 

క్రిష్ కష్టం, బాలయ్య ఇష్టం రెండూ కలిసి.. శాతకర్ణికి చరిత్రలో చోటు కల్పించేసిన మాట నిజం.

 

Read Also

 
Related News
JournalistDiary