India / General
ఖాకీవనంలో ఉషాకిరణం
168 days ago

మావోయిస్టు హాట్ బెడ్ పై మంచు పుష్పం మెరిసింది. అడవిబిడ్డలకు ఓ మనసైన ఆసరా దొరికింది. జవాన్ల కూంబింగ్ ఆపరేషన్ అనగానే చిగురుటాకుల్లా వణికే ఆదివాసీ మహిళల బతుకుల్లో ఇదో పొద్దుపొడుపు. విషయం ఏమిటంటే.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్తర్ రీజియన్లో మొట్టమొదటి మహిళా అధికారికి పోస్టింగ్ ఖరారైంది. పేరు ఉషా కిరణ్. వయసు 35 ఏళ్ళు. సీఆర్ఫీఎఫ్-80 బెటాలియన్ కు అసిస్టెంట్ కమాండెంట్ గా ఛార్జ్ తీసుకుని.. వెంటనే రంగంలో దిగేసింది. 

సెంట్రల్ రిజర్వ్ పోలీసుల అఘాయిత్యాలకు అడ్డాగా పేరున్న బస్తర్ ప్రాంతంలో ట్రైబల్ మహిళలకు దినమొక నరకం. జవాన్ల బూట్ల అలికిడి వినబడితే చాలు.. భయంతో చిగురుటాకుల్లా వణికిపోవడం అక్కడి మహిళలకు మామూలే. గత అక్టోబర్లో ఏకంగా 16 మంది ఆదివాసీ మహిళల్ని చెరబట్టి అత్యాచారం చేసిన ఘనత సీఆర్ఫీఎఫ్ జవాన్లకే చెల్లింది. మావోయిస్టుల ఏరివేత పేరుమీద జరిగిపోతున్న ఇటువంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టాలంటూ కేంద్రంపై వత్తిడి కూడా వుంది. ఈ క్రమంలోనే ఉషా కిరణ్ అపాయింట్ మెంట్ చోటు చేసుకుంది. ఈవిధంగానైనా.. జవాన్ల దుశ్చర్యలకు అడ్డుకట్ట పడవచ్చన్నది కేంద్రం ఐడియా. 

గుర్గావ్ కి చెందిన కుటుంబంలో పుట్టిన ఉషా కిరణ్ ది..  చిన్నప్పట్నుంచీ ఉక్కు సంకల్పమే. ఇప్పుడు కూడా స్వచ్ఛందంగానే  నక్సల్ ప్రభావిత ప్రాంతంలో పోస్టింగ్ వేయించుకున్నానని, ఆదివాసీ మహిళలకు బాసటగా ఉంటానని భరోసానిస్తోంది. అసలే పోలీసు డిపార్ట్ మెంట్.. పైగా మగాంధకారం.. ఇటువంటి పరిస్థితుల్లో డ్యూటీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తే.. ఛాలెంజ్ తీసుకోవడం తనకి ఇష్టమని జవాబిచ్చింది. ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారిన బస్తర్ ప్రాంతపు ఆదివాసీ మహిళల బతుకులకైతే ఉషా కిరణ్ రూపంలో ఒక అండ దొరికిందనే చెప్పాలి. 

 

 
 
 
Related News

JournalistDiary