AP and TS / Entertainment
మెగా ప్రతిష్ట తగ్గిందా? పెరిగిందా?
283 days ago

దాదాపు దశాబ్దం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేశాడు. ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150వ మూవీ బుధవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ సినిమా అంటే కొంత స్పెషాలిటీ వుంటుంది. ఇక రీఎంట్రీ మూవీ అంటే చెప్పనక్కర్లేదు.. ట్రెండ్‌కు తగినట్టుగానే వుంటుందని సగటు ప్రేక్షకుడి నమ్మకం. త‌మిళంలో మురుగ‌దాస్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ‘క‌త్తి’ని తెలుగులో వినాయ‌క్ డైరెక్షన్ చేస్తున్నాడ‌ని తెలియ‌గానే అంద‌రిలో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఠాగూర్ తరహాలో వుంటుందని అంచనాలు వేసుకున్నారు. మ‌రి ఈ అంచ‌నాలు ఎంతవ‌ర‌కు నిజమయ్యాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి ఓసారి వెళ్లాల్సిందే! 

స్టోరీ.. 

కోల్‌కతా జైలులో కత్తి శీను కనిపించడంతో స్టోరీ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న శీను హైదరాబాద్ వస్తాడు. ఈ నగరం నుంచి బ్యాంకాక్ వెళ్తున్నప్పుడు  లక్ష్మి (కాజల్) అనే యువతిని చూసి ప్రేమలో పడతాడు. దీంతో బ్యాంకాక్ వెళ్ళకుండా ఆగిపోతాడు. అదే సమయంలో ఒకరిపై హత్యాయత్నం జరుగుతుంది. అతగాడు అచ్చు తనలాగే ఉంటాడు. తనలా ఉన్న శంకర్ (చిరు డ్యూయల్ రోల్)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ రైతు నాయకుడని తెలుస్తుంది. అయితే కత్తి శీనును శంకర్ అని పొరబడిన జిల్లా కలెక్టర్ అతడిని రైతుల వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ (తరుణ్ అరోరా) రైతుల భూములను కాజేసి అక్కడ ఓ కూల్ డ్రింక్స్ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతడినే శంకర్ అని భావించి రైతుల భూములు తనకు దక్కేలా చూస్తే 25 కోట్లు ఇస్తానని ఆశ పెడతాడు....ఇలా బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను. చివరకు అగర్వాల్‌కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఏమిటి..? శంకర్ మాటేమిటి..? లక్ష్మి, కత్తి శీను లవ్ స్టోరీ ఏమైంది అన్నవి తెలుసుకోవాలంటే ఖైదీ 150 సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ...

పెద్ద గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించిన చిరంజీవి, రెండు రోల్స్ చేశాడు. హీరో లుక్, డ్యాన్స్ పర్వాలేదు. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదిరిపోయే స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా ర‌త్తాలు, సుంద‌రి, అమ్మడు లెట్స్‌డు కుమ్ముడు సాంగ్స్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. అలాగే యాక్షన్ సీన్స్‌లో అల‌రించాడు. డైరెక్టర్ వినాయ‌క్.. మాస్ యాంగిల్‌లో చిరంజీవిని చూపించాడు. అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను... న‌వ్వుకునేవాడు ఓరోజు ఏడ్చే రోజు వ‌స్తుందనే డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చిరంజీవి న‌ట‌న‌, ఎమోష‌న్స్, రైతు స‌మ‌స్యల‌పై చేసే పోరాట స‌న్నివేశాలు కొంతవరకు ఓకే. అలీ, ర‌ఘుబాబు కామెడీ ట్రాక్ ఓకే. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇక పృధ్వీ సన్నివేశాలు అవసరం లేకున్నా వాటిని తిరిగి చేర్చారు. ఇక  దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. మైనస్ పాయింట్ల విషయానికొస్తే... చిరంజీవి రీఎంట్రీ ప్రెస్టీజియస్‌గా తీసుకున్న మూవీనే కాదు. అభిమానుల్లో ఇప్పటికీ నేనునంటూ చెప్పే ప్రయత్నం చేశారు చిరు. శంకర్ ప్లేస్‌లోకి వెళ్లిన కత్తి శీను గెటప్ మార్చుకోకుండా నేరుగా కనిపించడం చూసినవాళ్లకు డ్రామాగా కనిపించింది. సిట్యుయేషన్‌కు సంబంధంలేకుండా సాంగ్స్ రావడం ప్రేక్షకులకు కాసింత చిరాకు కలిగించింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ డ్యాన్స్‌లకే ప‌రిమిత‌మైపోయింది. న‌ట‌న‌కు స్కోప్ లేదు.. లుక్ ప‌రంగా అనుకున్నంత గ్లామ‌ర్‌గా దర్శనమీయలేదు. త‌రుణ్ అరోరా త‌న పాత్రలో ఒదిగి పోయిన‌ప్పటికీ ఎఫెక్టివ్ విల‌నిజం లేక‌పోవ‌డం మైనస్ పాయింట్. క్లైమాక్స్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీ షోని కాసింత ప్రమోట్ చేసినట్టుగా కనిపించింది. నాగబాబు జడ్జీగా కనిపించిన సీన్లలో జబర్దస్త్ టీంలోని కొంతమందిని చూపించాడే తప్ప, వాళ్లకి మాట్లాడే ఛాన్స్ లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫ్యాన్స్‌కు తప్పితే, సగటు ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందని చివరకు తేలిపోయింది. 

 

Read Also

 
Related News
JournalistDiary