AP and TS / Entertainment
మన్యంపులి మూవీ రివ్యూ
292 days ago

మనమంతా, జనతాగ్యారేజ్‌ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన నటుడు మోహన్‌లాల్ న్యూఫిల్మ్ ‘మన్యం పులి’. ఈ మూవీ ద్వారా ఆయన ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. మాలీవుడ్‌లో ఫస్ట్‌టైమ్ 100 కోట్ల మార్క్‌ని టచ్ చేసిన చిత్రమిది. అక్కడే బాక్సాఫీసు బద్దలయ్యిందంటే.. టాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో వుందో చూడాలంటే ఓసారి రివ్యూలోకి వెళ్దాం... 

స్టోరీ... అడవిపై ఆధారపడి బతుకున్న వాళ్లలో కుమార్ (మోహ‌న్‌లాల్‌) ఫ్యామిలీ ఒకటి. ఓ టైగర్ కార‌ణంగా కుమార్ తన తండ్రిని కోల్పోతాడు. త‌ల్లి కూడా చ‌నిపోవడంతో త‌న త‌మ్ముడు సుబ్రమణ్యంకి అన్నీ తానై చూసుకుంటాడు. త‌న తండ్రిని చంపిన పులిని బావ సాయంతో మ‌ట్టుబెడ‌తాడు. అప్పటినుంచి పులియారు గ్రామానికి పులులు రాకుండా వాళ్లని కాపాడుతాడు. సీన్ కట్ చేస్తే..  అనాథ అమ్మాయి మైనా (క‌మ‌లిని ముఖ‌ర్జీ)ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకి చిన్న పాప కూడా ఉంటుంది. ఇక పాత విరోధం ఉన్న ఫారెస్ట్ అధికారితో (కిశోర్‌)తో కుమార్‌కి గొడ‌వ‌లు మొదలవుతాయి. సరిగ్గా అదే టైంలో డాడీ గిరిజ (జ‌గ‌ప‌తిబాబు)‌తోనూ విభేదాలు పెరుగుతాయి. దీనికి కారణమేంటి? అసలు గిరిజ, కుమార్‌‌ని ఎందుకు చంపాల‌నుకుంటాడు? అసలు డాడీ గిరిజ ఎవ‌రు? వంటి అంశాలన్నీ తెరపై చూడాల్సిందే! 

విశ్లేషణ... ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. అడ్వెంచరస్‌గా సాగే యాక్షన్‌ సీన్స్, విజువల్స్‌ కీలకమయ్యాయి. ఈ త‌ర‌హా సినిమా టాలీవుడ్‌లో క‌నిపించి చాన్నాళ్లయింది. ఆరంభంలో మూవీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుమార్‌ చిన్నప్పటి ఎపిసోడ్‌ ప్రధాన ఆకర్షణ. మోహన్‌లాల్‌ తెరపై కనిపించడం, ఆయన ఓ పులిని మట్టుబెట్టే సన్నివేశాల వరకు ఓకే. మోహ‌న్‌లాల్ ఈ వ‌య‌సులో పులితో చేసే ఫైట్స్ సూపర్బ్. ఫ్యామిలీ సీన్స్ ఎంటరయ్యాక స్టోరీలో వేగం తగ్గింది. మేక‌ప్ లేకుండా క‌మ‌లిని నేచుర‌ల్‌గా క‌నిపించింది. జ‌గ‌ప‌తిబాబు రోల్ ఓకే... ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా త‌న‌వంతు న్యాయం చేశాడు. 

త‌న ఇమేజ్‌ను ప‌క్కన‌పెట్టిన మోహ‌న్‌లాల్.. జ‌గ‌ప‌తి కాళ్లు ప‌ట్టడం, మ‌రో స‌న్నివేశంలో ఆయన్ని క‌మ‌లిని కాలుతో తోయడం వంటి సన్నివేశాలు చేయడం గమనార్హం. చిన్న పులితో మోహ‌న్‌లాల్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.  అడ‌వుల్లో పెరిగిన అమ్మాయిలాగా చ‌క్కగా న‌టించింది క‌మ‌లిని. ఎస్టేట్ ఓన‌ర్ కూతురిగా, స్థానిక యువ‌కుడిపై క‌న్నేసిన పాత్రలో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది న‌మిత‌. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్‌గా కిశోర్ న‌ట‌న‌, డాడీ గిరిజ రోల్‌లో జ‌గ‌ప‌తిబాబు బాగానే మెప్పించారు.

ఇక మిగతా నటీనటుల నటన కూడా బాగుంది. మైనస్‌లు కూడా లేకపోలేదు. ఇలాంటి స్టోరీ తెలుగు ప్రేక్షకుల‌కు కొత్తకాదు. సినిమాలో కామెడీ లేదు. హీరో త‌మ్ముడి క్యారెక్టర్‌ను ఇంకాస్త బలంగా మ‌లిస్తే బాగుండేది. సాంకేతికంగా సినిమాకి పూర్తిస్థాయిలో మార్కులు పడతాయి. షాజికుమార్‌ కెమెరా వర్క్ బెటర్. పారెస్ట్‌ని చాలా అందంగా చూపించాడు. అలాగే పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు కీలకం. కొన్నిచోట్ల కత్తెరలు వేస్తే బాగుండేది. ఓవరాల్‌గా సినిమాలు లేకపోవడంతో పులి కలెక్షన్ల  పంజా విప్పే అవకాశం లేకపోలేదు.


 
 
 
Related News
JournalistDiary