AP / Politics
బాబు 'టైమింగ్' అంటే అదే మరి!
65 days ago

నంద్యాల ఉపఎన్నిక.. అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికీ ప్రతిష్టాత్మకమే! చంద్రబాబు సర్కార్ ఏర్పడి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ మాత్రం ఉందన్న లెక్క తేలేది ఇక్కడే కనుక ఏపీ వ్యాప్తంగా జనం కూడా నంద్యాల మీద కాన్సన్ట్రేట్ చేసింది. మంత్రులు పదేపదే చెబుతున్నట్లు తమ పట్ల జనం సానుకూలంగా వున్నారన్నది ఎంతవరకు నిజమన్నది ఇక్కడే నిర్ధారణ కావాలి. దీన్ని 'రెఫరెండం' అంటూ ప్రచారం చేసుకోడానికి వైసీపీ సిద్ధమైపోయింది కూడా. ఈ క్రమంలో నంద్యాల ఓటు బ్యాంకుల మీద పార్టీలు బేరీజులేసుకుంటున్నాయి. ఏకంగా 65 వేల మంది ముస్లిం ఓట్లున్న నంద్యాలలో ఆ దిశగా 'రాజకీయాలు' కూడా మొదలైపోయాయి. పైగా.. రంజాన్ ఉపవాస దీక్షల సీజన్ కావడంతో.. ప్లాన్లు గీయడానికి పొలిటికల్ పార్టీలకు ఇంకా ఈజీ అయిపోయింది.

అధికార పార్టీ ఇప్పటికే 'రంజాన్ తోఫా' పేరుతో కానుకల సందడి మొదలుపెట్టేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ తోఫా పంపిణీ నంద్యాలలో మరింత విస్తృతంగా నడిపించేలా 'చర్యలు' తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే 'ఇఫ్తార్ విందు' ప్రోగ్రాం కోసం ఈసారి నంద్యాలను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో గుంటూరులో జరిగిన ఇఫ్తార్ విందు.. ఈసారి నంద్యాలలో పెట్టాలని చంద్రబాబు డిసైడ్ చేయడంతో ఏం 'టైమింగ్' బాసూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి. నంద్యాల నియోజకవర్గంలోని ముస్లిం 'పెద్ద'లనందరినీ ఒక వేదిక మీదికి తీసుకొచ్చేందుకు, వాళ్ళ నోళ్లు తీపి చేసేందుకు 'ఇఫ్తార్ విందు' కంటే మించిన ఎత్తుగడ ఇంకేమీ ఉండదు. ఇందుకోసం కోటి రూపాయల దాకా ఖజానా సొత్తు ఖర్చు అవుతున్నప్పటికీ.. మతపరమైన సంప్రదాయం కనుక ప్రశ్నించే అవకాశాలు ఎంతమాత్రం లేవు. అయితే.. ఈ తాకిడిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్నది సస్పెన్స్ గా మారింది.

 

దాదాపు 65 వేల సైజున్న ముస్లిం 'ఓటుబ్యాంకు'ను ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీగా తెలుగుదేశానికి ఒకింత 'వ్యతిరేకత' తప్పదు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తానన్న జగన్ మీద కూడా ముస్లిమ్స్ లో వ్యతిరేకత వుందన్నది తెలుగు తమ్ముళ్ల కామెంట్. లౌకిక పార్టీ అనిపించుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటికీ అభ్యర్థిని వెతుక్కోవడంలోనే మునిగిపోయింది. ఎవరి కసరత్తు ఎలాగున్నా.. నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేసేది మాత్రం ఆ ముస్లిం ఓటు మాత్రమే.

 
 
 

Read Also

 
Related News
JournalistDiary