AP and TS / Entertainment
గౌతమిపుత్ర శాతకర్ణి రివ్యూ
282 days ago

సంక్రాంతి సందర్భంగా బరిలోకి దిగింది బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ హీరో నటించిన చాలా చిత్రాలు సంక్రాంతి కానుకగా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. కాకపోతే 100వ మూవీ కావడం ఒకటైతే, రెండోది రాజుల నేపథ్యం మరొకటి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గురువారం థియేటర్స్‌కి వచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి. సాధారణంగా రాజుల స్టోరీ అంటే యుద్ధాలు, ఎత్తుకు పైఎత్తులు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవన్నీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకున్నాయో తెలియాలంటే రివ్యూలోకి డీటేల్‌గా వెళ్తే.. 

స్టోరీ..

దక్షిణ భారతంలో తిరుగులేని వీరుని ఖ్యాతి సంపాదించుకుంటాడు శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాలకృష్ణ). కుంతల, కల్యాణదుర్గం రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలుపుకోవడం, ఇంకోవైపు సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి (కబీర్‌బేడీ) ని ఓడించి శక పురుషుడిగా గుర్తింపు సాధిస్తాడు. ఉత్తర,దక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తాడు. ఐతే, అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండ భారతాన్ని చేజిక్కించుకోవాల‌ని గ్రీక్ చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. ఈ క్రమంలో శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. ఐతే, డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా ఓడిస్తాడా? కలలుగన్న అఖండభారతావనిని ఎలా సృష్టించాడు? ఇంతకీ శ్రియ ఎవరు? అన్నదే తెరపై చూడాలి. 

విశ్లేషణ... 

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి వందో సినిమా ఎంచుకున్న చరిత్రలో నిలిచిపోయే మార్క్‌ని క్రియేట్ చేసుకున్నాడు హీరో బాల‌కృష్ణ. స్టోరీకి తగ్గట్టుగా హీరోని ఎంపిక చేసుకోవడంతో క్రిష్ ఫస్ట్ విజయం సాధించాడు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా బాలయ్యని రాజుగా హుందాగా ఎలా వ్యవహరించాలో అలాగే తీర్చిదిద్దాడు. క‌ళ్యాణ‌దుర్గంపై శాత‌క‌ర్ణి దండెత్తడం మొదలు సినిమా ప్రారంభమవుతుంది. న‌హాప‌నుడి‌ని ఓడించి మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంలోకి తీసుకొస్తాడు శాత‌క‌ర్ణి. ఎట్ ద సేమ్ టైమ్.. అలెగ్జాండ‌ర్‌ సాధించలేదని తాను సొంతం చేసుకోవాలని భావించి యుద్ధానికి దిగుతాడు గ్రీకు చ‌క్రవ‌ర్తి డెమిత్రియ‌స్‌. ఆ రాజుని శాత‌క‌ర్ణి ఓడించ‌డంతో స్టోరీ ఫినిష్ అవుతుంది. న‌ట‌నప‌రంగా బాల‌కృష్ణ తన విశ్వరూపం చూపించాడు. ఎమోషన్స్ ప‌లికించ‌డంతోపాటు, వార్ సన్నివేశాలు ఆయన ర‌క్తి క‌ట్టించాడు. ఇక డైలాగ్స్ డెలివరీ గురించి చెప్పనక్కర్లేదు. స్టోరీ అదే ఆయువుపట్టులాంటింది. కొన్నిచోట్ల శాతకర్ణి సైన్యంలో మనము ఓ భాగమేనన్న ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు డైరెక్టర్ క్రిష్. న‌హాప‌నుడిపై వార్ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలు, యుద్దంలో వ్యూహ- ప్రతివ్యూహాలు మరో హైలైట్. త‌న కొడుకుకి వార్ గురించి స్టోరీ చెబుతూనే, ప్రత్యర్థుల్ని హెచ్చరించ‌డం, బంధీలుగావున్న సామంత‌రాజుల పిల్లల్ని విముక్తి చేయడం మేజర్ హైలైట్. డైలాగ్స్ కోసం బాలకృష్ణ మరింత కష్టపడ్డాడు. 

రాజ‌సూయ‌యాగంలో త‌ల్లికి అగ్రతాంబూలం ఇచ్చి పీఠంపై కూర్చోబెట్టే స‌న్నివేశాలు అల‌రించేలా ఉంటాయి. యుద్ధానికి త‌న బిడ్డ పులోమావిని తీసుకెళ్లాల‌ని శాత‌క‌ర్ణి భావించినప్పుడు వ‌శిష్టిదేవికి ఓ పాట రూపంలో తెలిసేలా చేసే స‌న్నివేశాలు డైరెక్టర్ ప‌నిత‌నానికి నిదర్శనం. శాత‌క‌ర్ణి తల్లిగా హేమ‌మాలిని ఒదిగిపోయింది. శ్రియ వ‌శిష్టిదేవిగా పాత్రలో లీన‌మైపోయింది. ఈమెని పర్‌ఫెక్ట్‌గా చూపించాడు. ఫస్ట్‌సాంగ్ చాలా బాగుంది.. మిగ‌తా న‌టీన‌టులంతా వాళ్ల పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. కన్నడ నటుడు శివ‌రాజ్‌కుమార్ ఓ పాట‌లో మెరుస్తాడు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. భారీ నేప‌థ్యంలో సాగే పోరాట సీన్స్‌ని డైరెక్టర్ స‌హ‌జంగా తీర్చిదిద్దారు. మరీ గ్రాఫిక్స్ కాకుండా కొంతలోకొంత ఒరిజినాల్టీని చూపించాడు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. సాయిమాధవ్‌ బుర్రా గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం, సిరివెన్నెల సాహిత్యం పర్వాలేదు. ఎక్కడా వల్గారిటీ లేదు.. అంతా వార్ సన్నివేశాలే! అక్కడక్కడా లోపాలు లేకపోలేదు. కొన్ని సీన్లకు కత్తెరలు వేయాల్సివుంది. యుద్ధ సన్నివేశాలను పదేపదే వాడడం మరో నెగిటివ్. ఫైనల్‌గా డిఫరెంట్ స్టోరీతో సంక్రాంతికి బరిలోకి రావడం బాలకృష్ణ కలిసొచ్చే అంశం. ఫ్యాన్స్‌కైతే 100శాతం పసందైన విందు. 

 

Read Also

 
Related News
JournalistDiary