జమ్ముకశ్మీర్లో మరో ఘోరం..! ఉగ్రవాదులు పాల్పడ్డ ఘాతుకానికి ఏకంగా 39 మంది CRPF జవాన్లు మృత్యువాతన పడ్డారు. హోమ్ మినిస్ట్రీ చెబుతున్న వివరాల ప్రకారం.. ఇది ఆత్మాహుతి దాడి అని, పేలుడు పదార్థాలతో కూడిన ఒక కారును ఇందులో ఉపయోగించారని తెలుస్తోంది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరా వద్ద జవాన్లతో వెళ్తున్న ఒక కాన్వాయ్‌కి ముష్కరుల కారు అడ్డుగా వెళ్లి.. రెండు వ్యాన్లను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

గాయపడ్డ వారిలో మరో మరికొంతమంది పరిస్థితి విషమంగా వుండడంతో శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ హాస్పిటల్‌కి తరలించారు. దాడికి పాల్పడింది తామేనని జైషే మొహ్మద్ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది.

‘ఒక సైనికుడిగా, ఒక భారతీయుడిగా నా రక్తం ఉడికిపోతోంది. అమర జవాన్ల త్యాగం గొప్పది. ముష్కరుల ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి వీకే సింగ్.  2016 సెప్టెంబర్లో జరిగిన యూరి దాడి తర్వాత.. అంతటి కర్కశపూరిత ఘటన ఇదే!  పార్టీలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిస్తూ, అమర జవాన్లకు సంతాపం తెలిపారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ తో మాట్లాడిన హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్.. రేపు ఘటనా స్థలాన్ని చేరుకోనున్నారు.

 

ఇదిలా ఉంటే.. పుల్వామాలో జవాన్లను పొట్టన బెట్టుకున్న జైషే మొహ్మద్ సంస్థ.. ఘటన తర్వాత ఒక వీడియోను విడుదల చేసింది. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది అదిల్ అహ్మద్ మాట్లాడిన చివరి మాటలు ఈ వీడియోలో వున్నాయి.

‘దక్షిణ కశ్మీర్‌ ప్రజలతో పాటు నార్త్‌, సెంట్రల్‌ కశ్మీరీలు, జమ్ము ప్రజలు కూడా మాతో చేరి ఇండియాపై తిరగబడాల్సిందే. కొంతమందిని చంపినంత మాత్రాన మేము బలహీనపడబోము. కాశ్మీర్ ప్రజలకు నేనిచ్చే ఆఖరి సందేశం ఇదే. ఈ వీడియో మిమ్మల్ని చేరేలోగా నేను స్వర్గం చేరి వుంటా.. ” అంటూ ఆవేశంగా చెబుతున్న మిలిటెంట్ అదిల్ దగ్గర జైషే జెండా.. ఆటోమేటిక్ రైఫిల్స్ వున్నాయి. పుల్వామా ప్రాంతానికే చెందిన అదిల్ రెండేళ్ల కిందట మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తీవ్రవాదుల్లో చేరినట్లు స్థానికులు చెబుతున్నారు.