శ్రియా పెళ్లయిపోయింది.. వేడుకలో స్టార్ల హంగామా

అక్కినేనివారి చిన్న కోడలు కావాల్సిన శ్రియా భూపాల్ దైవ నిర్ణయమో మరొకటో.. కాలేదు. చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌ కు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో నిన్న కన్నుల పండువలా పెళ్లయిపోయింది. అంగరంగవైభవంగా స్పెషల్ పార్టీ కూడా జరిగింది.

పెళ్లికొడుకు మరెవరోకాదు.. టాలీవుడ్ హీరో రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కజిన్‌ అనిందిత్ రెడ్డి. పెళ్లిపీటలపై పెళ్లి కూతురు‌.. అద్భుతమైన వజ్రాల నెక్లెస్‌తో తరుణ్‌ తహిలియానీ డిజైన్‌ చేసిన చీరలో మెరిసిపోగా, వరుడు‌.. క్లాసిక్‌ శెర్వానీతో సింపుల్‌ లుక్ లో కనిపించారు.

శ్రియా భూపాల్‌ ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు కాగా, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనవడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. కన్నుల పండువగా జరిగిన ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌ చరణ్‌ నుంచి మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ వరకు టాలీవుడ్‌ బడా సెలెబ్రెటీలు హాజరయ్యారు. ఉపాసనకు అనిందిత్ కజిన్‌ కాగా, శ్రియా వదిన దియా, నమ్రతా శిరోద్కర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌. నమ్రతా పిల్లలతో పాటు ఈ వివాహానికి హాజరయింది. టెన్నీస్ స్టార్ సానియా మిర్జా, ప్రజ్ఞా జైస్వాల్‌, లావణ్యత్రిపాఠి, స్నేహారెడ్డి కూడా ఈ వేడుకలో సందడి చేశారు.


ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.