సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ ఇష్యూ మరోసారి జాతీయస్థాయిలో చర్చ మొదలైంది. ఆయన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు ఆయన అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టాలి. కానీ, కొత్తగా బాధ్యతలు చేపట్టకుండానే అలోక్‌వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

తాను ఇక ప్రభుత్వ సర్వీసులో కొనసాగబోనని, తనను తప్పించిన తీరును తప్పుబట్టారు అలోక్‌వర్మ. తాను పదవీ విరమణ పొందినట్లుగా పరిగణించాలని, దీన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, సీబీఐ డైరెక్టర్‌ హోదా నుంచి తనను తప్పించడం కోసం ప్రక్రియ మొత్తాన్ని తలకిందులు చేశారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక ఫిర్యాదుదారుడు (అస్థానా) చేసిన ఆరోపణల ఆధారంగా తనకు వ్యతిరేకంగా సీవీసీ నివేదిక తయారైందన్నారు.

1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అలోక్‌వర్మ, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, మిజోరాం కేంద్ర పాలిత ప్రాంత (ఏజీఎంయూటీ) క్యాడర్‌కి చెందినవారు. నాలుగు దశాబ్దాల సర్వీసులో తనది మచ్చలేని రికార్డని, తాను 2017 జులై 31నే పదవీ విరమణ పొందినట్లు తెలిపారు వర్మ. సీబీఐ డైరెక్టర్‌గా రెండేళ్ల పదవీకాలం ఉన్నందువల్లే తాను సర్వీసులో కొనసాగుతున్నానని, ఈనెల 31న ఆ పదవీకాలం ముగుస్తుందన్నారు. తాను సీబీఐ డైరెక్టర్‌ పదవిలో లేనని, అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల విభాగానికి డైరెక్టర్‌ పదవి చేపట్టడానికి ఇప్పటికే పదవీ విరమణ వయసు దాటిపోయినట్లు రాసుకొచ్చారు. అందువల్ల శుక్రవారం నుంచి తాను పదవీ విరమణ చేసినట్టు భావించాలని కేంద్రాన్ని కోరారు.

మొత్తం సీబీఐ ఎపిసోడ్ వ్యవహారం మోదీ సర్కార్ మెడకు చుట్టుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా సీబీఐని తనకు అనుకూలంగా వాడుకుంటుందని ఆరోపణలు సంధించిన బీజేపీ, ఇప్పుడు అదే ఉచ్చులో ఇరుక్కుపోయింది. దీంతో జాతీయస్థాయిలో మోదీ సర్కార్ ప్రతిష్ట దిగజారిందనే చెప్పాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *