'అమ్మమ్మగారిల్లు' మూవీ రివ్యూ

సినిమా పేరు: ‘అమ్మమ్మ గారిల్లు’
విడుద‌ల‌ తేదీ: 25.05.2018
ఫొటోగ్రఫీ: ర‌సూల్ ఎల్లోర్‌
మ్యూజిక్: క‌ళ్యాణ ర‌మ‌ణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, భాస్కర‌భ‌ట్ల
నిర్మాత‌: రాజేష్‌
సంస్థ‌: స్వాజిత్ మూవీస్‌
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శక‌త్వం: సుంద‌ర్ సూర్య
న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, షామిలి, సుమిత్ర‌, రావు ర‌మేష్‌, శివాజీరాజా, హేమ‌, సుధ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ర‌విప్రకాష్ త‌దిత‌రులు

 

‘ఛ‌లో’ మూవీతో సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న యంగ్ హీరో నాగశౌర్య మంచి జోష్ లో ఉన్నాడు. అదే ఊపుతో తన తర్వాతి సినిమాకోసం కుటుంబ ప్రేమ, ఆప్యాయతల ఇతివృత్తంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్నాడు. ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాతో తాజాగా సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చాడు. సుందర్ సూర్య తెరకెక్కించిన ఈ సినిమా నాగశౌర్యలోని జోష్ ను కంటిన్యూ చేయిస్తుందో లేదో రివ్యూలో చూద్దాం..

స్టోరీ: ఈస్ట్ గోదావరి జిల్లాలోని పీఠాపురం అనే ఊరు నేపథ్యంగా జరిగే ఒక కుటుంబ కథ ఈ సినిమా. హాయిగా జీవనం సాగించే అదొక పెద్ద ఉమ్మడి కుటుంబం. అయితే, హఠాత్తుగా జరిగిన అమ్మ.. సీతామహాలక్ష్మి(సుమిత్ర) మరణం ఆ కుటుంబాన్ని పెద్ద కుదుపే కుదుపుతుంది. ఇంటికి పెద్ద కొడుకైన రవి బాబు (రావు రమేష్ )ఆస్థి పంచుకొని సిటీలో స్థిరపడాలనుకుంటాడు. ఎలాగైనా ఆస్థి పంచుకొని ఇంట్లో నుండి వెళ్లిపోవాలని కుటుంబసభ్యులతో గొడవకు దిగడంతో ఆస్తి పంపకాలపై పేచీలు మొదలవుతాయి. ఇవన్నీ చూస్తూ భరించలేని కుటుంబ పెద్ద రంగారావు(చలపతిరావు) కలత చెంది చనిపోతాడు. దాంతో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్న పెద్ద ఫ్యామిలీ తలో దిక్కైపోతుంది. 20 ఏళ్లు గడిచిపోయినా ఎవరూ తిరిగిరారు. ఈ క్రమంలో ఇంట్లో ఒకతే ఉంటున్న సంతోష్‌(నాగశౌర్య) అమ్మమ్మ అందరూ మళ్లీ కలవాలని ఆశపడుతుంది. దీంతో ఎలాగైనా కుటుంబాన్ని ఒక్కటి చేయాలని సంతోష్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం సంతోష్ ఏం చేశాడు? కుటుంబాన్ని కలిపాడా? అమ్మమ్మ ముఖంలో సంతోషం నింపాడా అన్నదే స్టోరీ.

విశ్లేషణ : ఇదే కథాంశంతో ఇంతకుముందు తెలుగుసినిమాలు చాలానే వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుదోచి సూపర్ హిట్లుకూడా అయ్యాయి. దీనికి కారణం స్టోరీ పాతదే అయినా దాన్ని చిత్రీకరించే విధానం.. హృదయాల్ని హత్తుకునే సన్నివేశాలు, ప్రేమ ఆప్యాయతలు కళ్లకు కట్టినట్టు చూపడమే. అయితే, అమ్మమ్మ గారిల్లు సినిమాలో ఆ సహజత్వమే కొరవడిందా అనిపిస్తుంది. థియేటర్లోని ప్రేక్షకులకు కొత్త కథ చూస్తున్నామన్న అనుభూతే కల్పించలేకపోయాడు దర్శకుడు. సినిమా మొదట్నుంచి చివరి వరకూ ఎక్కడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోవడం దర్శకుడి లోపమే అని చెప్పుకోవాలి. ఇక సెకండాఫ్ మొత్తం సినిమా నత్తనడకన సాగుతూ ప్రేక్షుకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

హీరో పరంగా నాగశౌర్య తన నటనను మరింత మెరుగుపర్చుకున్నాడనిపిస్తుంది. కాలేజ్ లైఫ్ బేస్ చేసుకుని సాగే సినిమాలు, లవ్ స్టోరీస్.. కుటుంబ కథా చిత్రాల్లో ఇప్పటి యువతరం పూర్తిగా ఒదిగిపోతూ మంచి ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అదే కోవలో శౌర్య మంచి మార్కులే కొట్టేశాడు. రావురమేశ్‌, నాగశౌర్య పాత్రలను అల్లిన విధానం బాగుంది. హీరోహీరోయిన్లు.. సంతోష్‌, సీత(షామిలి)పాత్రల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్లో డెప్త్ కనిపించదు. దీంతో వారి లవ్ స్టోరీ అంతగా పండలేదనే చెప్పాలి. ఆవేశపరుడైన ఇంటి పెద్దకొడుకుగా ఏ2 కాంట్రాక్టర్‌ బాబూరావుగా రావురమేష్ నటన హావభావాలు సినిమాకి హైలైట్‌. శివాజీ రాజా, సుమిత్ర, రవి ప్రకాశ్‌, హేమ, సుధ తదితరులు వాళ్ల పాత్రల మేరకు నటించారు. హీరో ఫ్రెండ్ పాత్రలో షకలక శంకర్‌ నవ్విస్తాడు. పోసాని, గౌతం రాజు, సమ్మెట గాంధీలకు మంచి పాత్రలే దక్కాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.