బాబు సర్కారుపై బీజేపీ అవిశ్వాసం!

త్వరలో విడుదల! అంటూ చంద్రబాబు మీద ఏపీ బీజేపీ మరో అస్త్రాన్ని బైటికి తీస్తోంది. ‘నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటూ బాబు విసిరిన అవిశ్వాసం పాచికనే ఏపీలో కూడా వెయ్యాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లోక్‌సభలో మోదీ సర్కారును ఇబ్బంది పెట్టిన బాబుని ఊరికే వదలకూడదని, ఏదోవిధంగా ‘కార్నర్’ చేయాలని అధిష్టానం నుంచి కన్నా అండ్ టీమ్‌కి ఆదేశాలొచ్చేశాయి. చంద్రబాబు పాలన అగమ్య గోచరంగా ఉందని, ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని రాజ్ భవన్లో గవర్నర్‌కి, ఢిల్లీ సచివాలయంలో హోమ్ మంత్రికి ఇప్పటికే ఫిర్యాదు చేసిన కమలం నేతలు.. లోకల్‌గా కూడా ప్రెజర్ బిల్డ్ చేయాలన్న ‘పన్నాగం’ పన్నేశారని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి.

 

త్వరలో ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు మీద ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టాలన్న ప్రణాళిక మీద ఏపీ బీజేపీ సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది. తమ చేతిలో వున్నది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే అయినా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో మాట్లాడి కావాల్సిన మద్దతు కూడగట్టి.. బాబుపై అవిశ్వాస అస్త్రం సంధించనుంది బీజేపీ. దీనికి సంబంధించి ప్రాధమిక చర్చలు కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. బాబు సర్కారు పనితీరుకు సంబంధించిన ‘డేటా’ సేకరణ ఇప్పటికే పూర్తి చేసింది ఏపీ బీజేపీ యంత్రాంగం.

100కు పైగా ఎమ్మెల్యేల బలమున్న టీడీపీ సర్కారును పడగొట్టడం అసాధ్యమే అయినప్పటికీ.. అవిశ్వాస ఘట్టం ద్వారా ఆయన ‘అవలక్షణాలను’ ప్రజలకు తెలియజెప్పవచ్చన్నది బీజేపీ ఆలోచన. వీళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే అసెంబ్లీ సమావేశాలే ఈ అరుదైన సందర్భానికి వేదికయ్యే అవకాశముంది!