అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి జరిగిన ‘న్యాయమే’ రేపటిరోజున చంద్రబాబుకీ జరుగుతుందా? తెలుగుదేశం అధినేత భవిష్యత్తు దాదాపుగా ఖరారైపోయిందా? ‘సెంటిమెంట్’ని చంద్రబాబు ఎంత మేరకు నమ్ముతారన్నది అటుంచితే.. ఇవ్వాళ్టి ఏపీ సీఎం ఢిల్లీ యాత్రను ఒక ‘సెంటిమెంట్’కు ముడిపెట్టి మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

రాష్ట్ర విభజనను బేషరతుగా ఖండించిన కాంగ్రెస్ నేతగా, అధిష్టానాన్ని ధిక్కరించి నిలబడ్డ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో ‘చరిత్ర’కెక్కాలనుకున్నారు. తనలోని కరడుగట్టిన సమైక్యవాదాన్ని బైటపెట్టుకోవాలన్న ఉద్దేశంతో, విభజనను అడ్డుకునే చివరాఖరి ప్రయత్నంగా అయన 2014 ఫిబ్రవరి నెలలో ఢిల్లీ టూరేశారు. కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి.. పిడికిలి బిగించి గట్టిగా అరిచిగీపెట్టేశారు. ఆయన వెంట అప్పట్లో ఏపీ కాంగ్రెస్ దిగ్గజాలు చాలామంది నిలబడ్డారు. చివరకు పార్టీనుంచి బైటికొచ్చి సొంత పార్టీ పెట్టి.. బొక్కబోర్లా పడ్డారు.

ఇప్పుడు.. చంద్రబాబు ఢిల్లీ యాత్ర కూడా దింపుడు కళ్లెం ఆశలతో చేపట్టిందేనని, అధికారపు అంచున నిలబడ్డ చంద్రబాబు ‘స్పెషల్ స్టేటస్’ సెంటిమెంట్‌ని దక్కించుకోవడం కోసం ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా ఇప్పటికే ప్రజాకర్షక పథకాలు ప్రకటించి.. జనంతో మమేకం కావడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు చంద్రబాబు. కియా కారెక్కారు.. ట్రాక్టర్ ఎక్కారు.. ఆటో కూడా ఎక్కారు..! చివరి ప్రయత్నంగా ఇప్పుడు ఢిల్లీ విమానమెక్కారు!

అవునన్నా కాదన్నా తనకు తాజా మాజీ ‘అధిష్టానం’ మోదీ సర్కారే! ఆ మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీ వేదిక మీద ధిక్కార స్వరం వినిపించిన చంద్రబాబు.. తెలుగు ప్రజల్లో ఎంత మైలేజ్ సంపాదించుకున్నారన్నది ఇప్పటికైతే తెలీదు. ప్రతిపక్ష వైసీపీ ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబుది ‘డ్రామా దీక్ష’ అని ప్రజలు నమ్ముతున్నారా? లేక బాబు మీద ఏపీ ఓటర్లలో గత విశ్వసనీయత ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందా? అనేది ఎన్నికల దాకా తేలేది కాదు. కానీ.. చంద్రబాబు ఢిల్లీ యాత్రను, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన ఢిల్లీ యాత్రతో పోల్చిచూస్తోంది ఏపీ రాజకీయాల్లోని ఒక వర్గం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *