చకచకా అనూహ్య పరిణామాలు జరిగిపోతున్న నేపథ్యంలో.. ఏపీలో ఏ పార్టీకా పార్టీ తమతమ సంచుల్ని ఎప్పటికప్పుడు తడిమి చూసుకోవాల్సి వస్తోంది. జంపు జిలానీల సీజన్‌కి గత నెలలోనే తెర తీసిన వైసీపీ.. ఆ ఒరవడికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతుందో చెప్పలేని పరిస్థితి. ”లోటస్ పాండ్ తలుపులు ఇప్పటికీ తెరిచే వున్నవి..” అంటూ వైసీపీ దండోరా వేస్తోంది. ఈ కోవలో టీడీపీకి తాజా షాక్.. గంటా శ్రీనివాసరావు..!

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మంచి పొజిషన్ ఎంజాయ్ చేస్తూ.. విద్యామంత్రిగా వున్న గంటా శ్రీనివాసరావు.. తన భీమిలి ఎమ్మెల్యే నియోజవర్గంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇరకాటంలో పడ్డారు. భీమిలితో పార్టీ ఫుట్‌బాల్ ఆడుకుంటోందని, నిన్నటిదాకా లోకేష్ పేరును, ఇప్పుడు సీబీఐ లక్ష్మీనారాయణ పేరును తెరమీదకు తీసుకొచ్చిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. ఆరునూరైనా తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు పార్టీ ఆదేశిస్తే దేనికైనా రెడీ అంటూ మెలిక పెడుతున్నారు. గతంలో కూడా విశాఖపట్నం భూముల కుంభకోణం వ్యవహారంలో అధిష్టానంపై అలిగి.. బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబే దిగొచ్చి గంటాను బుజ్జగించారు.

ఇప్పుడు భీమిలి టిక్కెట్ విషయంలో గంటాకు-బాబుకు మధ్య మళ్ళీ మనస్పర్థలు వచ్చేశాయి. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్ బయలుదేరి జగన్‌తో భేటీ అవుతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నారట. దీంతో.. ఏపీలోకెల్లా ఉత్తరాంధ్ర రాజకీయాలే ఎక్కువ వాడీవేడీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *