సడన్‌గా ఏపీలో అందరి దృష్టి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మీదకు మళ్లింది. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు జగన్ వెళ్లి ప్రశాంత్ కిషోర్‌ని ప్రత్యేకంగా కలిసినట్లు వార్తలొచ్చిన మరుక్షణం నుంచీ.. ‘అంతా ఆయనే చేశారు’ అంటూ వేలెత్తి చూపడం మొదలైంది. మంత్రి దేవినేని ఉమ అయితే.. ”జగన్ నుంచి ఆఖరి పేమెంట్ తీసుకోవడం కోసం.. ఫలితాల్ని వైసీపీకి భూతద్దంలో చూపెడుతున్నారు” అంటూ కామెంట్ చేశారు. ”జరిగిన హింస మొత్తానికీ అతడే కారణం. ఏయే నియోజకవర్గాల్లో గడబిడ సృష్టించాలో చెబుతూ పక్కా ప్లాన్ అమలు చేశారు. బీహార్ నుంచి ఏపీకి వచ్చి పిచ్చిపిచ్చి పనులు చేస్తే ఊరుకుంటామా?” అంటూ శివాలెత్తిపోయారు దేవినేని ఉమ.

ఇటు.. ప్రశాంత్ కిషోర్ చేయించిన పోస్ట్ పోల్ సర్వే అంటూ ఒక రిపోర్ట్ సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతోంది. వైసీపీకి ఏకంగా 130 సీట్లు వస్తాయన్నది పీకే లెక్క. ”తెలుగుదేశం గెలుపు వెయ్యి శాతం తథ్యం. అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు” అంటూ చంద్రబాబు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటే.. వైసీపీ మాత్రం సంబరాలకు ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ఇటు.. ఫలితాల ప్రకటన వరకు వైసీపీ ఆచరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని కూడా ప్రశాంత్ కిశోర్ టీమ్ IPAC రాసిచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ‘ఎన్నికల హింస’పై జగన్ వేసిన నిజనిర్ధారణ కమిటీ కూడా పీకే ఐడియానేనట.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ కూడా ప్రశాంత్ కిషోర్ టార్గెట్‌గా సీరియస్ కామెంట్ చేశారు. జగన్ నుంచి పీకేకి ఏకంగా రూ. 400 కోట్లు ముట్టిందన్నది పాల్ గారి స్టేట్మెంట్. వైసీపీలో తనకు గూడచారులున్నారని, వాళ్లు చెప్పిన లెక్క ప్రకారం ప్రశాంత్ కిషోర్‌కి బాగా గిట్టుబాటైందని పాల్ చెబుతున్నారు. రూ. 400 కోట్ల విలువైన సర్వీసులు ప్రశాంత్ కిషోర్ ఏం చేశారన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో షురూ అయింది. ఏదేమైనా.. ఏపీలో పెట్టిన రాజకీయ చిచ్చు పూర్తిగా రగిలేదాకా పీకే అండ్ పార్టీ ఇక్కడే వుండబోతోందన్నది తాజా సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *