ఏపీ సీఎం చంద్రబాబుపై తాను అలిగినట్టుగాను, పార్టీ మారే ఆలోచనలోనూ ఉన్నానంటూ వచ్చిన వార్తలను టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఖండించారు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంతో బాటు.. శనివారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి తను గైర్ హాజరు కావడంతో ఇక ఈయన కూడా పార్టీకి దూరం కావచ్చునన్న వార్తలు షికార్లు చేశాయి. కానీ వీటిలో నిజం లేదని చెప్పిన ‘ రాజుగారు ‘..తను టీడీపీ కార్యకర్తనని, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నాకెలాంటి విభేదాలూ లేవు. బాబుతో కలిసి ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఆయన వెంట వెళ్లి రాష్ట్రపతిని నేనూ కలిశాను అని ఆయన గుర్తు చేశారు.


ఈ నెల 15 న విశాఖ వెళ్లేందుకు తాను ఢిల్లీలో విమానం ఎక్కబోతుండగా పొలిట్ బ్యూరో గురించి సమాచారం అందిందని, అయితే అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక హాజరు కాలేకపోయానని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలిపానన్నారు.అలాగే కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్ టీడీపీలోకి రావడం తనకు ఇష్టం లేదని వచ్చిన ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు. ఆయన మంచి వ్యక్తి అని, పార్టీలోకి రావడం స్వాగతించదగిన విషయమని అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *