మరణమా శరణమా? బీజేపీతో పొత్తుపై బాలయ్య ఫీలింగ్!

మంగళవారం అసెంబ్లీ సమావేశం తర్వాత TDLP అత్యవసర భేటీ జరిగింది. బీజేపీతో తాడో పేడో తేల్చుకుందామా లేక ఇంకా వేచిచూద్దామా అన్న అంశంపై ఓటింగ్ పెట్టేశారు అధినేత చంద్రబాబు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటేనే ఉత్తమమని 95 శాతం మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడితే.. కొద్దికాలం వేచి చూద్దామన్న సావధాన వైఖరితో కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ ఐదారుగురితో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా గొంతు కలిపినట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దని బాలయ్య ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కూడా  సలహా ఇచ్చారట.

అయితే.. ఇప్పటివరకు ఓర్పుతో వ్యవహరించాం.. ఇకమీదట కూడా అదే ధోరణి కొనసాగిస్తే ప్రజల్లో చులకనై పోతామని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలోనే ఆవేశంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. 2014లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లే రేపటిరోజున బీజేపీని కూడా జనం మట్టికరిపిస్తారని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో దీంతో బీజేపీతో కటీఫ్ కొట్టి యుద్ధానికి దిగాల్సిందేనన్నది తెలుగుదేశం ఏకాభిప్రాయమని తేలిపోయింది. సహజంగా ఓటింగ్ పెట్టడం లాంటివన్నీ ‘కీలక నిర్ణయం’ తీసుకునే ముందు చేపట్టడం ఆనవాయితీ. ఆర్ధిక మంత్రిత్వ శాఖతో తమ వాళ్ళు రెండు విడతలుగా చర్చలు జరిపినా ఫలితం కనిపించని నేపథ్యంలో.. తెలుగుదేశం.. రేపోమాపో గట్టి నిర్ణయం ప్రకటించే అవకాశం వుంది.