తన్నీరు హరీష్ రావు.. కేసీఆర్ మేనల్లుడిగా ఎంత ప్రచారంలో వుంటారో.. సిద్ధిపేట ముద్దుబిడ్డడిగా కూడా అంతే పేరుంది. 2004 నుంచి సిద్ధిపేట నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. చరిత్రకెక్కారు. ఇప్పుడు ఆరోసారి గెలిచి డబుల్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నించి హిట్టు కొట్టేశారు. హరీష్ గెలుపు మీద ఎవ్వరికీ సందేహం లేకపోయినప్పటికీ.. ఈసారి హరీష్ దక్కించుకోబోయే మెజారిటీ మీద మాత్రమే ఆసక్తికరమైన చర్చ జరిగింది. లోకల్‌గా బెట్టింగులు కూడా షురూ అయ్యాయి.

హరీష్ మెజారిటీ మీద మిగతావాళ్లకంటే బామ్మర్ది కేటీఆర్‌కే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఈ విషయాన్ని పోలింగ్ సందర్భంగా ఆయనే బయటపెట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి కేటీఆర్ సిరిసిల్ల వెళ్తుండగా… హరీష్ రావు సిద్ధిపేట సెగ్మెంట్‌లో పోలింగ్ సరళి పరిశీలించి రిటర్న్ అయ్యారు. గుర్రాల గొంది గ్రామం దగ్గర ఇద్దరు మంత్రులూ ఎదురుపడి, కారు దిగి ఆత్మీయంగా పలకరించుకున్నారు. కాసేపు బాతాఖానీ వేసుకున్నారు.

”ఈసారి నీకు లక్ష లీడ్ ఖాయం బావా” అంటూ హరీష్‌రావుని విష్ చేసిన కేటీఆర్.. అక్కడితో ఆగకుండా.. ”నీకు లక్ష వస్తే అందులో నేను సగమైనా తెచ్చుకుంటా” అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళి మీద ముచ్చటించుకుని తర్వాత చెరో దారి పట్టారు. వీళ్లిద్దరికీ మధ్య అగాధం ఉందని, హరీష్‌ని కేసీఆర్ ఫ్యామిలీ దూరం పెడుతోందని వచ్చిన వరుస వార్తలకు చెక్ పెట్టడానికి ఎన్నోసార్లు ఇద్దరూ ప్రయత్నించారు. ఈ ఆత్మీయ కలయిక మాత్రం.. చాలా అరుదైనదని తెరాస శ్రేణులు ఫీలయ్యాయి.

1985 నుంచి తెలుగుదేశం తరపున కేసీఆర్‌‌ని నాలుగు సార్లు గెలిపించిన సిద్ధిపేట జనాభా.. ఆ తర్వాత తెరాస అభ్యర్థిగా హరీష్ రావును ఐదుసార్లు అసెంబ్లీకి పంపింది. ప్రతిసారీ రికార్డ్ మెజారిటీ సాధించారు హరీష్ రావు. 2014లో ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల లీడ్ తెచ్చుకున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ కి 2014లో 53 వేల మెజారిటీ వచ్చింది. ఈసారి హరీష్ ను, కేసీఆర్‌ని, కేటీఆర్‌ని ఓడగొట్టాలని ప్రజాకూటమి ప్రత్యేక కసరత్తు చేసినప్పటికీ.. ఆ పప్పులు ఉడకలేదు. సిద్ధిపేట నుంచి హరీష్ రావు ఏకంగా లక్ష పైచిలుకు మెజారిటీతో నెగ్గి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారు. ఇటు.. సిరిసిల్లలో సైతం కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోకీ హరీష్ రావు సాధించిన లీడ్ అత్యధికం కావడంతో.. టీ- ఛాంపియన్ గా ఆయన మరోసారి ఫిక్స్ అయ్యారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి అత్యల్ప మెజారిటీ (182) తో గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్ చిట్టచివరన నిలిచారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *