ఏపీ రాజకీయాల్లో నవ తరం నేతలు లోకేష్, పవన్ కళ్యాణ్. ఎమ్మెల్సీ రూట్లో పవర్లోకొచ్చి మంత్రిగా కొలువు తీరాడు నారా లోకేష్. సీఎం చంద్రబాబు తనయుడిగా, ఎస్టాబ్లిష్డ్ పార్టీ నేతగా ఆయనది రెడీమేడ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్. పవన్ కళ్యాణ్ మాత్రం సినీ కరిష్మానే పెట్టుబడిగా కొత్త పార్టీ పెట్టి.. ఈసారి ప్రజాక్షేత్రంలో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిద్దరి భవిష్యత్తూ మరో రెండుమూడు నెలల్లో తేలిపోనుంది. మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోయే వీరిద్దరి మీద ఏపీ జనంలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల వడపోతను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. తాను పోటీ చేయబోయే ఎమ్మెల్యే సెగ్మెంట్‌పై కూడా అనధికారికంగా క్లారిటీనిచ్చేశారు. విశాఖ పట్నం జిల్లా గాజువాకను పవన్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. లక్షకు పైగా సభ్యత్వాలున్న మెగా నియోజకవర్గంగా గాజువాక ఇప్పటికీ జనసేనకు హాట్ సీట్ అనిపించుకుంది. ఇక్కడనుంచి పవన్ పోటీ చేస్తే తిరుగుండదని, ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందని వారి భరోసా.

ఇటు.. లోకేష్ నియోజకవర్గం మీద కూడా ఏడాదిన్నరగా ఊహాగానాలు వస్తూనే వున్నాయి. చినబాబు కోసం సీటు వదులుకోడానికి సిద్ధమంటూ అరడజను దాకా టీడీపీ సిట్టింగులు ప్రకటించేశారు. తాజాగా.. చంద్రబాబు అడ్డాగా పేరున్న కుప్పం నుంచే చినబాబు పోటీ చేస్తారని పార్టీలో గుసగుసలు వినిపించాయి. నాన్న అభీష్టం కూడా అదే అయినప్పటికీ కొడుకు సుముఖంగా లేరట. అందుకే.. లోకేష్ కోసం మరో చోటు కోసం వెతుకులాట వేగవంతమైంది. విశాఖ జిల్లా భీమిలిని ఖరారు చేసినట్లు ప్రముఖ దినపత్రికలో కథనం రావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ నార్త్‌కి తరలించి లోకేష్‌కి భీమిలి రిజర్వ్ చేయనున్నట్లు ఆ కథనం చెబుతోంది.

లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ విశాఖ జిల్లా మీద కన్నేయడంతో.. నార్త్ కోస్టల్ బెల్ట్ ఒక్కసారిగా వేడెక్కింది. లోకేష్ కనుక భీమిలికి కమిట్ అయితే.. పవన్ కళ్యాణ్ కూడా భీమిలికి షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకర్నొకరు ఓడించుకోవాలన్న పట్టుదలతో ఇద్దరూ భీమిలి మీద పడితే.. ‘భీమిలి’ సినిమా మరింత రక్తి కట్టడం ఖాయం. ఇప్పటికే టీడీపీ తాజా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా చక్రం తిప్పుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *