బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పొలిటికల్ కెరీర్‌కి బీజేపీ మంగళం పాడేసింది. 1991 నుంచి తనను ఆరుసార్లు ఎంపీగా గెలిపించిన గాంధీనగర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు బీజేపీ చీఫ్ అమిత్ షా కబ్జా చేశారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 184 మందితో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఈమేరకు అనూహ్యంగా అద్వానీ పేరును తొలగించింది. దీంతో.. కమలదళంలో అద్వానీ శకానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇంకా వారణాసి – నరేంద్ర మోదీ, గాంధీనగర్ – అమిత్ షా, నాగ్ పూర్ – నితిన్ గడ్కరీ, లక్నో- రాజ్ నాధ్ సింగ్, ఘజియాబాద్ – వీకే సింగ్, ఆమెధీ -స్మృతి ఇరానీ, మధుర – హేమమాలిని.. పేర్లు ఖరారయ్యాయి.

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు నర్సారావు పేట ఎంపీ సీటు ఇచ్చారు. విశాఖ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నారు. బాలకృష్ణ అల్లుడు భరత్ పేరును విశాఖ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. సమీప బంధువులుగా వీరిద్దరి మధ్య జరిగే పోటీ ఆసక్తికరంగా మారనుంది. వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ బరిలో వున్నారు. జనసేన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను నిలబెట్టింది. విశాఖ నుంచి 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థి హరిబాబు నిలిచి గెలిచారు. ఈసారి విశాఖ ఓటరు ఎవరికి పట్టం కడతాడో చూడాలి.

బీజేఎల్పీ నేతగా ఉంటూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ ఎంపీ సీటు కేటాయించింది బీజేపీ అధిష్టానం. సికింద్రాబాద్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు విశ్రాంతినిచ్చినట్లయింది. నిన్ననే పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత డీకే అరుణకు మహబూబ్ నగర్ సీటు దక్కింది. తెలంగాణలో మిగతా బీజేపీ అభ్యర్థులు వరంగల్ – సాంబమూర్తి, మల్కాజ్ గిరి – రామచంద్రరావు, నల్గొండ – జితేంద్రకుమార్, కరీంనగర్ – బండి సంజయ్, నిజామాబాద్ – డీ అరవింద్, నగర్ కర్నూల్ – బంగారు శృతి, భువనగిరి – పీవీ సుందర్ రావు, మహబూబాబాద్ – హసన్ నాయక్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *