బీజేపీలో అంతర్గత విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. లోపల ఏం జరిగిందో తెలీదుగానీ.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ టికెట్‌ కేటాయించలేదు పార్టీ హైకమాండ్. ఆయన పోటీ చేసే నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ఈ వ్యవహారంపై బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎదుగుదలకు ముఖ్య కారకుడైన అద్వానీని ఈసారి పక్కకుపెట్టి, ఆయనను అగౌరవపరిచారని నేతలు విరుచుకుపడుతున్నారు. దీనిపై ఎట్టకేలకు నోరు విప్పింది బీజేపీ.

గాంధీనగర్‌లో అద్వానీ విజయం వెనక అమిత్‌ షా ఉన్నారని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌. ఇందులో అద్వానీ ప్రతిభ ఏమీలేదని చెప్పకనే చెప్పేశారు. అద్వానీ గెలిచిన ప్రతి ఎన్నికల్లోనూ వెనక షా ఉన్నారని, అక్కడ ఇన్‌ఛార్జిగా ఆయనే వ్యవహరించారని గుర్తు చేశారు. అద్వానీ విస్తృత పర్యటనలు చేసేవారని, ఆ సమయంలో అమిత్‌ షా కృషితోనే అద్వానీకి విజయం చేకూరిందని చెప్పుకొచ్చారు జావడేకర్‌. మొత్తానికి బీజేపీలో అద్వానీ శకం దాదాపు ముగిసినట్టే! ఇంత జరుగుతున్నా అద్వానీ ఎందుకు నోరు మెదపలేదు? సమయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారా? రేపటి రోజున కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టకుంటే లుకలుకలు బయటకు వస్తాయని చెబుతున్నారు ఆ పార్టీలోని నేతలు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *