'2019లో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుంది'

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్నారు బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందని.. వైసీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు జగన్‌ను చూసి యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. యూటర్న్‌ కన్నా.. బాబు టర్న్‌ అంటే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ సభలకు జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారని.. ఏపీలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రానికీ హోదా లేదని చెప్పుకొచ్చారు. ఏపీలోనే పాలన సరిగాలేదు.. కర్నాటకలో మీరు ఏం చేస్తారు? నిప్పులాంటి సీఎం ఎందుకు భయపడాలంటూ విష్ణుకుమార్‌రాజు కర్నాటక పాలిటిక్స్ ప్రస్తావిస్తూ టీడీపీని విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయమని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.