పాత సీసాలో కొత్త సారా పోసి బలవంతంగా తాగించాలన్న బోయపాటి స్కెచ్ ఈసారి అడ్డం తిరిగేసింది. తాజా మూవీ మెగా ఫ్యామిలీని తేరుకోలేనంత దెబ్బ తీసిందని.. రంగస్థలం హిట్టుతో చెర్రీ కట్టుకున్న భారీ సైజ్ కటౌట్ కూడా కుప్పకూలిపోయిందని రివ్యూలు తేల్చేశాయి. ‘వినయవిధేయ రామ’ మూవీ అవుట్‌ఫుట్‌పై నడుస్తున్న విపరీతమైన సెటైర్లు.. సినిమాను పండగ పోటీలో లేకుండా చేసేలా వున్నాయి. ఈ దెబ్బతో.. టాలీవుడ్‌లో ‘బోయాలజీ’కి తెర పడినట్లేనన్న ఖరారు కూడా జరిగిపోయింది.

యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్ కలిపికొట్టి.. కమర్షియల్ సక్సెస్ సాధిస్తాడనేది బోయపాటి శ్రీనివాస్ మీదుండే బలమైన విశ్వాసం. ‘భద్ర’ దగ్గర మొదలైన బోయపాటి దండయాత్రలో.. ఒకటీ అరా తప్పితే.. మిగతావన్నీ భారీ హిట్లే! మూసపోసినట్లు అన్నీ ఒకేలా వున్నప్పటికీ.. ఆ రకంగానే మాస్ ఆడియెన్స్ పల్స్ గట్టిగా పట్టేసుకున్నాడు. బీ, సీ సెంటర్లకు బోయపాటి సినిమా అంటే పిచ్చి. బాలయ్యకు సింహా, లెజెండ్ లిచ్చినట్లే.. బన్నీకి ‘సరైనోడు’నిచ్చినట్లే.. తనకూ ఏదోఒకటి ఇస్తాడన్న ఆశతో బోయపాటితో ఫిక్స్ అయ్యాడు చెర్రీ. ‘వినయ విధేయ రామ’ ప్రాజెక్ట్ మీద మెగా ఫ్యాన్స్ కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

చెర్రీని పూర్తి మేకోవర్‌తో రాంబో స్థాయిలో చూపెట్టిన బోయపాటి.. సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాడు. కానీ..  తన మార్క్ ‘స్టఫ్’ని మోతాదుకు మించి దట్టించబోయి బోల్తా పడ్డాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం.. చివరివరకూ విలన్ స్టామినాను పెంచుతూ వెళ్లడం బోయపాటి స్టైల్. దానికి తగ్గట్లు అడుగడుగునా తెరమీద ‘రక్తపాతం’ సీన్లతో అలికెయ్యడం కూడా బోయపాటి స్క్రీన్ ప్లే శైలి. పోరాట సన్నివేశాల్ని కూడా ఒక మోస్తరుగా ఉంటేనే ఆస్వాదించడం అలవాటు చేసుకున్న సగటు ప్రేక్షకుడు.. ‘వివిరా’లో నెత్తుటి మడుగుల్ని జీర్ణించుకోలేకపోయాడు. అస్సలు లాజిక్కే లేని స్టంట్ సీన్లు అరడజను దాకా ఉన్నట్లు చెర్రీ అభిమానులే లెక్కేసి చెబుతున్నారు.

యావరేజ్ ఆడియెన్స్ థియేటర్లోంచి పారిపోవడం గ్యారంటీ అనే టాక్ మొదటి షో నుంచే మొదలైంది. నలుగురు అన్నల ముద్దుల తమ్ముడి పాత్రలో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని అలరిస్తాడనుకున్న చరణ్ కూడా.. తన అసాధారణమైన ‘అరివీర’ పెర్ఫామెన్స్‌తో సగటు ప్రేక్షకుడ్ని భయపెట్టి చంపేశాడని రివ్యూలన్నీ ఏకిపారేస్తున్నాయి. కేవలం ‘సి’ సెంటర్లను మాత్రమే ఎంతోకొంత ఆకట్టుకునే ఛాన్స్ ఉండడంతో.. ఈ మలుపు వద్ద ‘బోయాలజీ’ బొక్కబోర్లా పడ్డట్లే లెక్క! సో.. బోయపాటి తాజా బాధితుడిగా రామ్ చరణ్ పేరు నమోదైనట్లే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *