మొసలి తినేసిన చెయ్యి..5 రోజులకే ఆమె పెళ్లి

సౌతాఫ్రికాలోని జింబాబ్వే లో జరిగిందో దారుణం. మరి కొద్ది రోజుల్లో తన ప్రియుడితో పెళ్లి కాబోతున్న పాతికేళ్ళ యువతి చేతిని తినేసిందో మొసలి. దాని దాడిలో ఆమె కుడి చెయ్యి కోల్పోయినా..ఈ ఘటన జరిగిన ఐదు రోజులకే ఆమె తన ప్రియుడ్ని పెళ్ళాడింది. వివరాల్లోకి వెళ్తే.. జనేలీ నుడ్లోవు అనే ఈ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ జెమి ఫాక్స్ ఇటీవల అడ్వెంచర్ టూర్ పెట్టుకుని జింబాబ్వే లోని ఓ నదిలో విహారానికి వెళ్ళారు.


విక్టోరియా జలపాతానికి అతి దగ్గరలోనే ఉందీ నది ! అందులో మొసళ్ళ సంచారం ఎక్కువగా ఉంటుందని తెలిసినా ఈ జంట భయపడలేదు. నదిలో సరదగా బోటు షికారు చేస్తుండగా..హఠాత్తుగా ఓ మొసలి దాడి చేసింది. ఈ దాడిలో జనేలీ నదిలో పడిపోగా ఆ మొసలి ఆమె చేతిని పట్టేసింది. ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని ఆమె అనుకున్నంతలో ఆమె కాబోయే భర్తతో సహా..టూర్ ట్రైనర్లు సాహసించి నదిలో దూకి ఆమెను రక్షించారు.

అయితే ఈ ఘటనలో జనేలీ తన చేతిని కోల్పోయింది. ఈ షాకింగ్ సమాచారం తెలిసి వెంటనే వచ్చిన సహాయకబృందాలు ఆమెను ఆసుపత్రికి తరలించాయి. హాస్పిటల్ లో డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆమె చేతిని తొలగించాల్సి వచ్చింది. ఇంత జరిగినా..ఇది జరిగిన ఐదు రోజులకే ఆసుపత్రిలోనే జనేలీ, జెమి ఫాక్స్ ఒకింటివారుకావడం ఆశ్చర్యం. అ ప్రాంతంలో  జనేలీ ఓ సెలబ్రిటీ అయిపోయింది. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోనివాళ్ళు లేరు.