ఎరిక్సన్ ఇండియా కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఇందులో ఆయనను దోషిగా కోర్టు తేల్చింది. అనిల్ అంబానీతోపాటు మరో ఇద్దరు డైరెక్టర్లు సతీష్‌ సేత్‌, ఛాయా విరానీలు నాలుగు వారాల్లో 453 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మొత్తాన్ని నెలలోగా డిపాజిట్ చేయకపోతే.. కోటి చొప్పున జరిమానా, నెల రోజుల జైలుశిక్ష విధిస్తామని పేర్కొంది.

 

తమకు చెల్లించాల్సిన 550 కోట్లు రూపాయలను అనిల్ సహా బోర్డు డైరెక్టర్లు ఇవ్వలేదని చెబుతూ కోర్టు ధిక్కరణ కింద ఎరిక్సన్ ఇండియా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎరిక్సన్‌ తరపు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే తన వాదనలు వినిపించారు. రఫెల్‌ కోసం, ప్రతిష్ఠాత్మకమైన ప్రతి ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి డబ్బు ఉంటుందని, తమకు చెల్లించడానికి మాత్రం ఉండదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అనిల్‌ అంబానీ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. చివరకు న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *