సీబీఐ లొల్లి మళ్ళీ మొదలైంది. ఈ దర్యాప్తు సంస్థలో నెం.టూ అయిన రాకేష్ ఆస్థానా అరెస్ట్ తప్పకపోవచ్చు. అవినీతి కేసులో ఆయనపై విచారణ జరగాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆయన పైనా, సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ లపై దాఖలైన కేసును ఎత్తివేసేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఆస్థానాను అరెస్టు చేయకుండా నివారించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రొటెక్షన్ ను కూడా తొలగించాలని సూచించింది. ఈ ముగ్గురిపై విచారణను 10 వారాల్లోగా ముగించాలని జస్టిస్ నజ్మీ వజీరీ… సీబీఐకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఆస్థానా, మనోజ్ కుమార్ లను ప్రాసిక్యూట్ చేసేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదని కూడా ఆయన అన్నారు. ఈ ముగ్గురూ తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్లను కోర్టు విచారించింది. (హైదరాబాద్ కు చెందిన బిజినెస్‌మన్ సతీష్ సనా ఇచ్చిన ఫిర్యాదుపై వీరిమీద ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేశీకి సంబంధించిన కేసునుంచి తనను తప్పించేందుకు తాను ఆస్థానాకు ముడుపులు సమర్పించుకున్నానని సతీష్ సనా ఆరోపించిన సంగతి తెలిసిందే). ఇదిలా ఉండగా..సీబీఐ చీఫ్ గా అలోక్ వర్మను తప్పించాక..అడిషనల్ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావుని తిరిగి ఈ పదవిలో నియమించారు. డ్యూటీలో చేరిన వెంటనే ఆయన..అలోక్ వర్మ గత రెండు రోజుల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను మార్చివేశారు. గతంలో నాగేశ్వర రావుకు సన్నిహితులుగా భావించిన అయిదుగురు అధికారులను అలోక్ వర్మ బదిలీ చేయగా.. ఇప్పుడు ఆ బదిలీలను రద్దు చేస్తూ నాగేశ్వర రావు నిర్ణయం తీసుకున్నారు. అలోక్ వర్మను సీబీఐ చీఫ్ గా తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆయన మళ్ళీ ఈ కుర్చీ మీద కూర్చున్నా..గురువారం సాయంత్రం ప్రభుత్వం ఆయనను మరో శాఖకు బదిలీ చేసిన విషయం విదితమే. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన అలోక్ వర్మ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *