మహిళల డార్మెటరీల్లో సీసీ కెమెరాలు

విజయవాడ దుర్గమ్మ గుడి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. దుర్గగుడి తరుపున ఇటీవల వన్‌టౌన్‌లోని సీవీ రెడ్డి ఛారిటీస్‌లో డార్మెటీరీలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఉచిత డార్మెటరీలతో పాటు ఏసీ డార్మెటరీలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఈ ఏసీ గదులు ఉన్నాయి. అయితే, మహిళలు దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరాలు గుర్తించిన భక్తులు, అధికారులను నిలదీశారు.. మూడు రోజుల నుంచి సీసీ కెమెరాలు పని చేయడం లేదని ఒకరు, కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని ఇంకొకరు తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాలు రికార్డు చేయడం లేదంటే, కెమెరాల వద్ద లైట్లు ఎందుకు వెలుగుతున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డార్మెటరీలను కేవలం విశ్రాంతి కోసమే తప్ప దుస్తులు మార్చుకునేందుకు కాదని ఈవో పద్మ ఓ ప్రకటనలో తెలిపగా, వివాదం గురించి తెలుసుకున్న దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు మహిళల గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడం పొరపాటేనని ఒప్పుకున్నారు.