'ఎయిర్ ఏషియా ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు-అశోక పేర్లు'

ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో దొరికిన ఫోన్‌ సంభాషణల్లో టీడీపీకి చెందిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అశోక్‌ గజపతిరాజు, ఏపీ సీఎం చంద్రబాబు పేర్లు బయటపడ్డాయన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే అనుమతులు వస్తాయని.. అశోక్‌గజపతిరాజు నాతో చెప్పారని సంభాషణల్లో ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రసన్నంతోనే 2016లో ఎయిర్ ఏషియాకు అశోక్‌గజపతిరాజు అనుమతులు పొడిగిస్తూ జీవో ఇచ్చారన్నారు.

ఈ లాబీయింగ్‌ కోసం సింగపూర్‌కి చెందిన హెచ్‌ఎన్‌ఆర్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు రూ.12.28 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారని బొత్స చెప్పుకొచ్చారు. అశోక్‌గజపతిరాజు అవినీతికి పాల్పడ్డారని, మూడు అతిపెద్ద కుంభకోణాలు చేశారని బొత్స ఆరోపించారు. ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో నిజానిజాలు సీబీఐ విచారణలో బయటకొస్తాయని బొత్స అన్నారు. చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు ఏపీ పరువు తీశారని.. నిజాయితీపరులైతే విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బొత్స డిమాండ్ చేశారు. కుటుంబరావు వాడుతున్న భాష సరిగాలేదని.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదా మర్చిపోకూడదని బొత్స అభిప్రాయపడ్డారు.