రెండు స్పెషల్ రైళ్లు, 11 వందల లగ్జరీ రూములు, ఖరీదైన భోజనాలు..! కేవలం 12 గంటల ఢిల్లీ దీక్షకు చంద్రబాబు ఖర్చుపెట్టిన మొత్తం రూ. 10 కోట్లట! మొదట్లో రైళ్లు అద్దెకు తీసుకోడానికి కోటీ 12 లక్షలు మంజూరు చేసినట్లు దీక్షకు ముందే ఒక జీవో మీడియాలో మెరిసింది. ఓహ్.. ఇంతే కదా అనుకున్నారు అందరూ. కానీ.. జరిగింది మాత్రం మరో రకంగా ఉంది.

చంద్రబాబు దీక్ష కోసం ఢిల్లీకి వచ్చిన వారి కోసం హోటళ్లలో 1100 ఖరీదైన రూమ్‌లు బుక్ చేశారు. కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, భోజన సదుపాయాలు.. అన్నీ కలిపి అక్షరాలా రూ.10 కోట్లు తగలేసినట్లు ఏపీ ప్రభుత్వమే ఒప్పుకుంది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి విడుదలైన జీవో ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది.

ఏపీ ఖజానా నుంచి రిలాక్సేషన్ ఫండ్ పేరిట ‘సీఎం ఢిల్లీ దీక్ష’ కోసం 10 కోట్లు మంజూరు చేసినట్లు ఖరారు కావడంతో.. ప్రతిపక్షానికి ఇదొక అస్త్రంగా మారింది. ఇప్పటికే పార్టీ పోరాటానికి ప్రజల ఖర్చు పెడుతున్నారంటూ పెద్దఎత్తున వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ-వైసీపీ.. ఇకముందు మరింత రెచ్చిపోనున్నాయా?

‘నా ప్రోగ్రాం ఖర్చు మా పార్టీ కార్యకర్తల కష్టార్జితం. చంద్రబాబు దీక్షల ఖర్చు మాత్రం జనం కష్టార్జితం’ అంటూ గుంటూరు పర్యటనలో మోదీ కూడా సూటి విమర్శలు చేశారు. మోదీ ఖరీదైన సూట్లకు, ఆయన తినే ఇంపోర్టెడ్ పుట్టగొడుగులకు బీజీపీ ఖర్చు పెడుతోందా? అంటూ టీడీపీ నుంచి విమర్శలొస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *