అన్నీ సరే.. ఆ ఒక్కటీ అడగొద్దంటున్న చంద్రబాబు..!

నాలుగేళ్ల టీడీపీ-బీజేపీ పవిత్ర బంధానికి తెరపడిపోయింది. కేవలం వారం రోజుల్లో జరిగిన వరుస కీలక పరిణామాలు ఈ రెండు పార్టీల మధ్య మైత్రికి తూట్లు పొడిచేశాయి. JFC రిపోర్ట్ పేరుతో ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్, కేంద్రంపై అవిశ్వాసం పేరుతో మరోవైపు నుంచి జగన్ పెడ్తున్న ‘టార్చర్’కి చంద్రబాబు సరెండర్ కాక తప్పలేదు. ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటూనే, మరో వైపు పార్టీ స్ట్రాటజీల్నిరీడిజైన్ చేసుకుంటూ.. గత వారం రోజుల్లో టీడీపీ అధినేత ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏదో ఒకటి చెయ్యకపోతే జనంలో తేలికభావం ఏర్పడుతుందన్న ఆందోళన బాబును పరుగులు పెట్టించిన మాట వాస్తవం. గతంలో స్వచ్ఛందంగా వదిలేసుకున్న ‘ప్రత్యేక హోదా’ డిమాండ్ ను మళ్ళీ చేతికందుకోవడంతో మొదలుపెట్టి.. అనేక సంచలన నిర్ణయాలకు తెగించారు.

మొదటగా.. కేంద్ర క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను బైటికి లాగేసుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమితోనే తెగతెంపులకు సిద్ధమయ్యారు. ఏకంగా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. ఇలా.. వరుస ఎత్తులతో అటు బీజేపీతో వైరం పెంచుకోవడంతో పాటు.. ఇటు వైసీపీ మీద పైచేయి సాధించాలన్నది చంద్రబాబు స్ట్రాటజీ. కానీ.. సమావేశాల ముగింపు సమయంలో తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటన మాత్రం చంద్రబాబును ఇరకాటంలో పడేస్తోంది. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన పక్షంలో తెలుగుదేశం ఎంపీలు సభలో కొనసాగడం తప్పుడు సంకేతాలిచ్చినట్లవుతుంది. అవిశ్వాసం విషయంలో.. వైసీపీని హైజాక్ చేయగలిగిన చంద్రబాబు.. ఎంపీల రాజీనామాల విషయంలో ఏం చేస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.