ఏపీలో తమది జీరో సైజే అయినప్పటికీ.. ఆశలు వదులుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఆఖరి శ్వాస వరకూ పోరాడాలన్న రాజకీయ సూత్రాన్ని అనుసరించి రఘువీరా క్యాంప్ ముందుకెళ్తోంది. ఒకవైపు చంద్రబాబుతో సంబంధాలు దెబ్బతినకుండా.. మరోవైపు పార్టీ ఉనికి కోల్పోకుండా ఆచితూచి అడుగులేస్తోంది ఏపీ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక దగ్గర కూడా ఏ మాత్రం రాజీ పడ్డం లేదు. డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టి తెలుగుదేశానికి పరోక్ష సహకారం అందిస్తుందన్న వైసీపీ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. హేమాహేమీల్ని బరిలో దింపేసింది ఏపీసీసీ.

పల్లం రాజు, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు లాంటి కీలక శాల్తీల్ని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్న స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కాంగ్రెస్ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన మరో అంశం అరకు ఎంపీ సెగ్మెంట్. ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి శృతి దేవిని బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ. ఈమె మాజీ కేంద్ర మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ పొలిటీషియన్ కిశోర్ చంద్ర దేవ్ కూతురు.

2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి.. కేంద్ర మంత్రిగా ఎలివేషన్ పొందారు కిషోర్ చంద్రదేవ్. తర్వాత 2014లో యాంటీ-కాంగ్రెస్ వేవ్ కారణంగా కేవలం 50 వేల ఓట్లు మాత్రమే దక్కించుకుని ఘోర పరాజయం పొందారు. ఆయనకున్న ట్రైబల్ ఫ్రెండ్లి ఇమేజ్‌ని క్యాప్చర్ చేద్దామన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు టీడీపీ తరపున సైకిల్ గుర్తు మీద పోటీకి దిగారు కిషోర్ చంద్రదేవ్. తండ్రికి ఎదురు నిలబడి గెలిచి తీరతానంటూ శృతి దేవి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెచ్చిమరీ టిక్కెట్ తీసుకుంది.

అరకులో తండ్రీ కూతుర్ల మధ్య జరగబోయే పోరు మీద జనంతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. కొన్నాళ్లుగా జనంలో తిరుగుతూ.. కిషోర్ చంద్రదేవ్ కూతురిగా బాగా ప్రచారం పొందిన శృతి.. ఇప్పుడా కరిష్మాను కాంగ్రెస్ ఖాతాకి ధారబోయనుంది. దీనికితోడు.. మహిళా ఓటుబ్యాంకును వీలైనంత ఎక్కువగా చీల్చి పార్టీకి ఎడ్జ్ తీసుకురావాలని ఆమె కష్టపడుతోంది. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు చెవిన కూడా పడిందట. కిషోర్ చంద్రదేవ్‌తో టీడీపీ వ్యూహకర్తలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *