రాజకీయాల్లో ఎవ్వరు ఎవ్వరితోనూ శాశ్వత శత్రుత్వం పెట్టుకోరు. ఎప్పుడు ఎవ్వరితో ఎటువంటి అవసరాలు వచ్చిపడతాయో తెలీదు కనుక ఎవ్వరి జాగ్రత్తల్లో వాళ్లుంటారన్నది కుహనా రాజకీయ నీతి సూత్రం. ఇవ్వాళ ఒకళ్ళ మీద మరొకరు కత్తులు దూసుకున్నా.. రేపటిరోజున ఆ రెండు కత్తులూ ఒకే ఒరలో ఒద్దిగ్గా ఇమిడిపోయినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. రేపటిరోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అదే జరగబోతోందా?

ఢిల్లీ గడ్డ మీద ధర్మ పోరాట దీక్ష పేరుతో హడావిడి చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. వీలైనంత ఎక్కువ ఎక్స్‌పోజర్ రాబట్టుకోవడం కోసం తంటాలు పడ్తున్నారు. అక్కడి జాతీయ స్థాయి నేతల్ని, మిగతా ప్రాంతీయ పార్టీల నేతల్ని ఏపీ భవన్‌కి రప్పించుకుని వేదిక మీద గ్రూప్ ఫోటోలు దిగుతూ సందడి చేసుకున్నారు చంద్రబాబు.

గ్యాప్ దొరికినప్పుడల్లా నేషనల్ మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చుకున్నారు. ఈ క్రమంలోనే.. న్యూస్18తో మాట్లాడిన చంద్రబాబు.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష వైసీపీతో మీ వైఖరి ఎలా వుండబోతోంది.? జగన్‌ని మీ కూటమిలోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేయబోయినప్పటికీ.. చివరికి స్పందించక తప్పలేదు బాబుకి.

”జగన్‌కి రెండోమూడో ఎంపీ సీట్లొస్తే.. జాతీయ ప్రయోజనాల మీద ఆసక్తి చూపితే.. కూటమిలోకి స్వాగతిస్తాం” అన్నారు. తీవ్రమైన రాజకీయ వైరుధ్యమున్న వైసీపీతో సైతం ‘పోస్ట్‌పోల్ అలయన్స్’కి అవకాశం ఉందన్న చంద్రబాబు స్టేట్మెంట్.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చేసింది. ఒకవేళ ఫలితాలు చంద్రబాబుకు అనుకూలంగా రాని పక్షంలో జగన్-రాహుల్ మధ్య బేరసారాలు కుదరొచ్చని, అవసరాన్ని బట్టి జనసేనకు కూడా రెడ్‌కార్పెట్ పడవచ్చని.. రాజకీయ వర్గాల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *