ఏప్రిల్ తర్వాత పాత చంద్రబాబు తెరపైకి..

ఎన్డీఏకి టీడీపీ బై చెప్పేయడంతో ఒక్కసారిగా హస్తినలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వచ్చే నెలలో జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే కీలక ప్రకటన రాబోతోందంటూ రిపబ్లిక్ టీవీ ప్రస్తావించింది. సీఎం చంద్రబాబు ఇప్పటికే 11 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, అమరావతిలో వచ్చే నెలలో నిర్వహించనున్న మహానాడులోగానీ ఆ తర్వాత గానీ ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు రాసుకొచ్చింది. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నారని ప్రస్తావించింది.

బాబు మాట్లాడిన వారిలో శరద్‌పవార్-ఎన్సీపీ, అఖిలేశ్ యాదవ్-ఎస్పీ, మాయావతి- బీఎస్పీ, మమతా బెనర్జీ- టీఎంసీ, నవీన్ పట్నాయక్-బీజేడీ, ఎంకే స్టాలిన్- డీఎంకె, ఫరూక్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్), ఓం ప్రకాశ్ చౌతాలా-ఐఎన్ఎల్, అరవింద్ కేజ్రీవాల్- ఏఏపీ వంటి నేతలున్నారు. ప్రస్తుతం ఆయా పార్టీలకున్న ఎంపీల ప్రకారం.. ఫ్రంట్‌కు 90 మంది ఎంపీలున్నట్టే! మరోవైపు చంద్రబాబు మాత్రం తనకు రాష్ర్టమే ముఖ్యమని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని మనసులో మాట బయటపెట్టారు.