తెలంగాణ టాప్.. కాగ్‌ ప్రకటనపై కేసీఆర్‌ హ్యాపీ

తెలంగాణ రాష్ట్రానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఫుల్ మార్క్స్ వేసింది. గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ప్రకటించింది. 2014 జూన్‌ నుంచి 2018 మే వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్లను కాగ్‌ తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కూడా కాగ్‌ వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏడాది నమోదైన ఆదాయ వృద్ధిని పొందుపరిచింది.

తెలంగాణ రాష్ట్రం17.2 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, 14.2 శాతంతో హరియాణా రెండో స్థానంలో, మహారాష్ట్ర మూడు, ఒడిశా నాలుగో స్థానంలో, పశ్చిమ్‌బంగ ఐదో స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే 10 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేయగా, మిగతా రాష్ట్రాల్లో వృద్ధిరేటు తక్కువగా నమోదైనట్టు కాగ్‌ తెలిపింది. తెలంగాణలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధిరేటు సాధించగా, 2016-17లో 21.1 శాతం, 2017-18లో 16.8శాతం వృద్ధిరేటు లభించింది. ఈ నాలుగేళ్లలో సగటున 17.2 వృద్ధిరేటుతో రాష్ట్రం ముందంజలో నిలిచింది. కాగ్ నివేదికపై సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నోట్ల రద్దు , జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని..ఆదాయ వృద్ధితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేసేందుకు వీలుంటుందని కేసీఆర్ అన్నారు.