కేసీఆర్ కుంభవృష్టి

తెలంగాణ రైతన్నల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల కుంభవృష్టి కురిపించారు. రైతులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని.. అనారోగ్యం వచ్చినా.. అకాల మరణం పొందినా రూ. 5 లక్షల బీమా కల్పిస్తామని ప్రకటించారు. బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు బీమా సదుపాయం అమలు చేస్తామన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రైతులకు ప్రమాద బీమా చేయించడంలో రైతు సమన్వయ సమితులదే కీలకపాత్ర అని సీఎం చెప్పారు.

ఇక మామిడి తోటలు సహా అన్ని పండ్ల తోటల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. 2020 నాటికి కోటి ఎకరాలకు ప్రాజెక్టుల నీళ్లు వస్తాయన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే రైతుల వార్షికాదాయం 1.25 లక్షల కోట్లుకు చేరుతుందని చెప్పారు. రైతు సమన్వయ సమితులతో లక్షా 61వేల సైన్యం ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని సీఎం ఈ సందర్భంగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. యాభైశాతం సబ్సిడీపై ట్రాక్టర్లు..పొలాల సోలార్ ఫెన్సింగ్‌కూ సబ్సిడీ ఇస్తామన్నారు.