ఎట్టకేలకు మాజీ కేంద్రమంత్రి, శ్రీకాకుళం కాంగ్రెస్ లీడర్ కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జగన్‌ని కలిశారు ఆమె. సమావేశం అనంతరం మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఈనెల 28న వైసీపీలో చేరుతానని తెలిపారు. తాను టికెట్ ఆశించి వైసీపీలోకి రాలేదని, బేషరతుగా చేరుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కృపారాణికి కేవలం 24 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక వైసీపీ తరపున రెడ్డిశాంతి పోటీ చేశారు.

శ్రీకాకుళంలో కిల్లి- ఎర్రంనాయుడు ఫ్యామిలీ మధ్య ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్నరీతిలో సాగుతోంది. 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కిల్లి, ఎర్రంనాయుడు చేతిలో ఓడిపోయారు. 2009లో ఎన్నికల్లో ఎర్రంనాయుడుపై కృపారాణి గెలిచారు. విభజన కారణంగా ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆమె పోటీ చేసి ఘోరంగా ఓటమి చవిచూశారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన కృపారాణి, అందుకు అనుగుణంగా పావులు కదిపారు. ఎన్నికల ముందు చేరితే బాగుంటుందని వైసీపీ పెద్దలు సలహా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు దూరంగా వుంటూ వచ్చారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె బరిలోకి దిగే అవకాశాలు వున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *