మోదీ 'నేర చరిత్ర'.. 185 ఎపిసోడ్స్!

‘మేరా భారత్ మహాన్.. ఇక్కడ మనుషుల కంటే గోవులే సురక్షితం..’ ఇటువంటి గంభీరమైన వరుస సెటైర్లతో మోదీ సర్కార్ సతమతమవుతోంది. ఘర్ వాపసీ, గోరక్షణల ముసుగులో దేశవ్యాప్తంగా జరిగిపోతున్న వరస దురాగతాలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మానవతావాదులకు సమాధానం చెప్పుకోలేక మొహం చాటేస్తోంది కూడా.

 

నాలుగేళ్ల పాలనలో మోదీ సాధించిన విజయాలు ఫలానా అంటూ పుస్తకమేసి ఇంటింటికీ వెళ్లి పంచిపెడ్తున్న కమలనాధులు.. కొన్ని వాస్తవాల్ని మాత్రం దిగమింగుకోలేపోతున్నారు. ఈ బలహీనతనే ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచేసింది. నాలుగేళ్ల మోదీ పాలనలో నెత్తుటి మరకలు ఇవీ అంటూ లెక్కగట్టి చెప్పిన రియల్ రిపోర్ట్ డాట్‌ఇన్ వెబ్‌సైట్‌ని ఎండార్స్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని సరికొత్తగా మొదలుపెట్టింది. మోదీ హయాంలో బీజేపీ అండ చూసుకుని మొత్తం 185 ద్వేషపూరిత హింసా ఘటనలు జరిగాయన్నది సదరు కథనం సారాంశం.

గోవుల్ని దొంగిలించారనో, గోమాంసం తిన్నారనో, గోహత్యకు పాల్పడ్డారనో.. ఇటువంటి మతసంబంధిత కారణాలతో మోరల్ పోలీసింగ్‌కి పాల్పడి.. ‘అవతలివాళ్ల’ నెత్తురు కళ్లజూసిన వాళ్లపై కనీస చర్యలు తీసుకోలేదన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అభియోగం.