గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గురించి ఆపార్టీ కీలకనేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో తనకూ అసంతృప్తి ఉందన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి స్థలం దొరకడం లేదని, ప్రతీ చోటా ఇదో పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికితోడు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే.. మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఎన్నో సంక్షేమపథకాలను కేసీఆర్ ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తోందని ఇదికూడా మనకు పెద్ద సమస్య కాదన్నారు.

ఇదిలాఉండగా, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై మాజీ ఇండియన్ క్రికెటర్, కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ఘాటు విమర్శలు గుప్పించారు. బైద పీపుల్‌ తెలంగాణలో ఫర్‌ద పీపుల్‌గా మారిందని, టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చి గద్దెనెక్కారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సిద్దూ ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కు మద్దతుగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 40 శాతం ప్రజలు రోజుకు కనీసం 140 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని.. కానీ సీఎం కేసీఆర్‌ తన కోసం రూ. 300 కోట్ల భవంతిని నిర్మించుకున్నారని విమర్శించారు. వెదురు బొంగు పొడుగ్గానే ఉన్నా.. లోనంత డొల్లేనని.. తెలంగాణ పాలన కూడా అలాంటిదేనన్నారు. ‘సోనియాగాందీ వల్లే తెలంగాణ ఏర్పడిందని, పార్టీ విలీనం, దళిత సీఎం హామీలు ఇచ్చిన కేసీఆర్ ఎలా రంగులు మార్చారో అందరికీ తెలిసిందేనంటూ సిద్దూ విమర్శలు గుప్పించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *