తెలంగాణ ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాన్ని కెలకడం షురూ చేసింది. ఇది ముందుగా ఊహించిన పరిణామమే. సహజంగానే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కొంత డిఫెన్స్‌లో పడింది. ‘కాంగ్రెస్ పార్టీతో కొత్త కాపురం’ అనేది ఇప్పుడు టీడీపీ క్యాడర్లో హాట్ టాపిక్. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం రెండు పార్టీల్లోనూ అంతులేని ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. బాలయ్య తీస్తున్న ‘ఎన్టీయార్’ బయోపిక్ మీద చంద్రబాబు స్పెషల్ ఎటెన్షన్ పెట్టేశారు. సినిమా కంటెంట్‌లో మార్పులు చేయాలన్న బాబు డైరెక్షన్స్ ఇప్పుడు మేకర్స్‌ని చిక్కుల్లో పడేశాయి. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పట్లో ఎన్టీయార్ కనబరిచిన వైఖరికి.. ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్న ధోరణికి స్పష్టమైన తేడా ఉండడంతో సినిమా ప్రభావం వర్తమాన రాజకీయంపై పడవచ్చన్నది పార్టీ నేతల ఆందోళన. ఎన్టీయార్ పొలిటికల్ వెర్షన్‌లో మార్పులు చేయాలని, కనీసం డైలాగుల్నయినా మార్చి రాయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డైరెక్టర్ క్రిష్‌ని కన్విన్స్ చేయడానికి బాలయ్య చాలా కష్టపడ్డారట.

ఈనెల 16న విడుదలయ్యే ట్రైలర్ కంపోజిషన్లో కూడా కొన్ని మార్పులు చెయ్యక తప్పలేదు. ట్రైలర్ ద్వారానే సినిమా వర్త్ ఏమిటో చెప్పాల్సిన బాధ్యత డైరెక్టర్‌పై వుంది. కానీ.. ఇప్పుడున్న పొలిటికల్ సిట్యువేషన్‌ని బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ని రూపొందించడానికి టీమ్ కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. 21న నిమ్మకూరులో జరిగే ఆడియో రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబును చీఫ్ గెస్ట్‌గా పిలిచి ప్రాజెక్టుకి హైప్ తీసుకురావాలన్న యోచనలో వున్నారు హీరో బాలకృష్ణ.

బయోపిక్‌లోని బాలయ్య గెటప్స్ మీద సోషల్ మీడియాలో ‘బిగ్ ఫైట్’ నడుస్తోంది. నాన్నను బాలయ్య మరిపించారని ఒక వర్గం అంటుంటే.. అవును నాన్నను నిజంగానే ‘మరిపించారని’ మరొక బ్యాచ్ సెటైర్లు సంధిస్తోంది. సినిమా మీద నెగిటివ్ ప్రమోషన్ పెరగడం కోసం పొలిటికల్ సోషల్ మీడియా కూడా చెమటోడుస్తోంది. రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ప్రాజెక్ట్ ఊసయితే అసలే లేదు. ఇంతవరకూ కాస్టింగ్‌కి సంబంధించిన నిర్దిష్ట సమాచారం బైటికి పొక్కలేదు.

అట్టహాసంగా విడుదల తేదీలు కూడా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. నిర్మాణం విషయంలో ఆ దూకుడు చూపించడం లేదని, సినిమా ఆగిపోయినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. బాలయ్య తీస్తున్న బయోపిక్ మాత్రం రెండు భాగాలుగా కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో జనవరి 9న, జనవరి 24‌న విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. సినిమాలో వుండే సరుకెంతన్నది 16న బైటికొచ్చే ‘ట్రైలర్’తో తేలిపోవచ్చు. ఒక్కటయినా పొలిటికల్ పంచ్ లేకపోతే ట్రైలర్ జనంలోకి చొచ్చుకుపోయ్యే అవకాశం లేదన్నది వాస్తవం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *