దంపతులు.. లేదా ప్రేమికులు..! రిలేషన్‌షిప్ ఏదైనా.. ఇద్దరి మధ్య బంధం ఒద్దిగ్గా నడవాలంటే.. థాట్ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిందే! ఒకరి మనోభావాల్ని మరొకరు అర్థం చేసుకుని, ఒకరికి నచ్చినట్లు మరొకరు వ్యవహరించడం ద్వారా బంధం గట్టిపడే అవకాశం వుంది. కానీ.. అది మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎందుకొస్తాయి.. ఎక్కడొస్తాయి అని ఆరా తీస్తే.. అక్కడ స్వార్థపరత్వం మాత్రమే పెద్ద కారణంగా కనిపిస్తుంది. పార్టనర్ దగ్గర మనకు తెలీకుండానే సెల్ఫిష్‌గా ప్రవర్తిస్తామన్నది అసలు విషయం. ఎలా అంటే.. !

  • మీ మాటను, మీ భావాల్ని మీ భాగస్వామి ఓపిగ్గా వినాలని మీరు ఆశిస్తారు. కానీ.. అవతలి మనిషి మాటను కూడా అంతే ఓపిగ్గా వినాలన్న చిత్తశుద్ధి మీకుండదు.
  • అర్థవంతమైన సంభాషణతో అవతలివాళ్ళను నెగ్గలేనప్పుడు.. చాటుమాటుగా నిశ్శబ్దంగా నీకు తోచిన రీతిలో పార్టనర్‌ని ట్రీట్ చేయాలనుకోవడం మెచ్యూరిటీ అనిపించుకోదు.
  • ఏ విషయంలోనైనా.. మీ దృక్కోణం మాత్రమే సరైనదన్నది మీ పట్టుదల. దాన్నుంచి మీరు ఎప్పుడూ బైటికి రావాలనుకోరు.
  • రిలేషన్‌షిప్‌లో మీ పార్టనర్ మాత్రమే స్వార్థపర బుద్దితో ఉన్నట్లు పదేపదే అభియోగం మోపుతారు. మీరు నిస్వార్థ జీవులన్న భావనతో ఉండిపోతారు.
  • మీ ప్రమేయం లేకుండానే మీ భాగస్వామి ప్లాన్స్ వేస్తూ అన్నీ చక్కదిద్దుతున్నప్పుడు.. మీలో ఒకరకమైన ఆందోళన కలగడం సహజం. కానీ.. అటువంటి భావన ప్రమాదకరం.
  • మీ భాగస్వామికి సంబంధించిన స్నేహితులు, కుటుంబీకుల విషయంలో మీరు విమర్శనాత్మక ధోరణితోనే వుండడం కూడా ఒక సమస్యే!
  • పార్టనర్‌కి సంబంధించిన కనీస అవసరాల్ని పట్టించుకోకపోవడం.. మీ అవసరాల విషయంలో పార్టనర్‌ ఆసక్తి చూపకపోతే తప్పుబట్టడం.. ఒక పరిపక్వత లేనితనం కిందే లెక్క!
  • ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దొరక్కపోతే.. ఆ నిస్సహాయ స్థితిని కప్పిపుచ్చుకోడానికి ‘మనమధ్య సంబంధం వదిలేసుకుంటా’నని బెదిరిస్తారు. మీ ఉద్దేశం అది కాకపోయినప్పటికీ.. ఆలా హెచ్చరించడం ద్వారా తాత్కాలికంగా మీ ఇగోని అలా సంతృప్తిపరుచుకుంటారు.

ఇద్దరి మధ్య దూరం పెరగడానికి దోహదపడే ఈ ఎనిమిది అంశాలకూ ఒకటే కేంద్రం.. ‘స్వార్థపరత్వం’! దాన్ని వదిలిపెట్టుకుని పరిపక్వమైన ఆలోచనతో నడుచుకుంటే.. మిమ్మల్ని చూసి చిలకా గోరింకలే ఈర్ష్య పడ్డం ఖాయం! ఇది మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *