టాప్‌లో అమిత్ షా ‘బ్యాంక్‌’

నోట్ల రద్దుకు అనేక కారణాలు చెబుతోంది బీజేపీ. ఈ వ్యవహారం ఆ పార్టీకి వరంగా మారిందని ప్రతి పక్షాలు సైతం బలంగా చెబుతున్నాయి. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్టర్‌గావున్న అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు (ఏడీసీబీ)లో నోట్ల రద్దు తర్వాత ఆ నోట్ల డిపాజిట్లు వెల్లువెత్తాయి. జిల్లా సహకార బ్యాంక్ అన్నింటిలోనూ ఈ బ్యాంక్‌కే ఎక్కువ డిపాజిట్లు వచ్చాయి. ఐదురోజుల్లో మొత్తం రూ.745.59 కోట్ల విలువైన రూ.500, రూ. 1000 నోట్లు జమ అయ్యాయి. ముంబైకి చెందిన ఆర్‌టీఐ కార్యకర్త మనోరంజన్‌ ఎస్‌.రాయ్‌ తన పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. అమిత్‌ షా ఇంకా ఆ బ్యాంక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2000లో దానికి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఏడీసీబీ తర్వాత రాజ్‌కోట్‌ జిల్లాలో వున్న సహకార బ్యాంకు నిలిచింది. డీసీసీబీల ద్వారా బ్లాక్‌మనీని అనేకమంది వైట్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ఆర్బీఐ, పెద్దనోట్ల రద్దు జమ చేసే బ్యాంకుల జాబితా నుంచి డీసీసీబీలను నవంబరు 14న తొలగించింది. కానీ అప్పటికే వేల కోట్ల రూపాయలు జమైపోయాయి. అలా జమ చేసిన నోట్లకు సంబంధించిన వాళ్లపై ఎలాంటి విచారణ జరగలేదని వివరించారు ఆర్టీఐ కార్యకర్త.

దేశవ్యాప్తంగా డిపాజిట్‌ అయిన రద్దయిన పెద్ద నోట్ల మొత్తం విలువ రూ.15.28లక్షల కోట్లు. అందులో సగానికిపైగా అంటే రూ.7.91లక్షల కోట్లు కేవలం ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, 32 రాష్ట్ర సహకార బ్యాంకులు, 370 జిల్లా సహకార బ్యాంకులు, దాదాపు 40 తపాలా కార్యాలయాల్లో జమయ్యాయి. ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.7.57 లక్షల కోట్లు, 32 రాష్ట్ర సహకార బ్యాంకుల్లో రూ.6,407 కోట్లు, 370 జిల్లా సహకార బ్యాంకుల్లో రూ.22,271 కోట్లు జమయ్యాయి. 39 తపాలా కార్యాలయాల్లో జమయిన మొత్తం రూ.4,408 కోట్లు. మిగిలిన 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దయిన పాత నోట్ల డిపాజిట్ల వివరాలను వెల్లడించలేదు.