పైఅంతస్తు మీదికెళ్లి ఒక మూలన కూర్చుని మనసారా ఏడవాలనిపిస్తుంది.. ఒక్కోసారి చచ్చిపోవాలని కూడా ఉంటుంది.. పని మీద ధ్యాస కలగడం లేదు. ఒకరకమైన బోరింగ్, రొటీనిటీ ఫీలింగ్..! స్వాతి అనే ఒక కార్పొరేట్ స్కూల్ టీచర్, అంకిత అనే కమ్యూనికేషన్ కన్సల్టెంట్, శ్రేయ అనే కంటెంట్ డిజైనర్, మధు అనే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.. ఇలా.. వీళ్ళందరికీ ఒక అరుదైన సారూప్యత వుంది. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకునే ఇటువంటి కోట్లాదిమందిని ఒక రకమైన అంతుబట్టని మానసిక కష్టం వెంటాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

ఒకరికొకరు చెప్పుకోడానికి కూడా ఇష్టపడరు కనుక.. తాము అనుభవిస్తున్న ఈ బాధ తమ కొలీగ్స్‌లో కూడా చాలామందికి ఉందన్న విషయం వాళ్లకు తెలీదు. తమకొక్కరికే ఇలా అనిపిస్తోందన్న లోన్లీ ఫీలింగ్ కారణంగా వారు మరింత డిప్రెషన్‌లోకి జారుకుంటారు. అసోచామ్ వారి రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ప్రైవేట్ సెక్టార్‌లోని దాదాపు 42.5 శాతం మంది ఉద్యోగులు ఈ రకమైన ఆందోళనతో రోజులీడుస్తున్నారు. యాజమాన్యాలు సెన్సిటైజేషన్ వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నా, మానసిక ఉల్లాసం కోసం బ్రేక్స్ ఇస్తున్నా.. ఉద్యోగుల్లో ఈ ‘వెలితి’ని మాత్రం పూడ్చలేకపోతున్నాయట.

‘ఒక్కోసారి పొద్దున్నే నిద్ర లేవడంతోనే ఆందోళన మొదలవుతుంది. దాన్నుంచి బైటపడి మామూలుగా మారడానికి కనీసం గంట సమయం పడుతోంది. 9to5 జాబ్ కోసం అప్పటికప్పుడు తయారై ఉరుకుల పరుగుల మీద ఆఫీసుకెళ్లాల్సి వస్తోంది..’! ఇది సగటు వేతనజీవుడి ఆవేదన. ”13 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగమే. మంచి అనుభవం వున్న పనే. అయినా ప్రతిరోజూ క్లయింట్ దగ్గర ప్రెజెంటేషన్ చేయడంలో ఇబ్బంది పడ్తున్నాను. ఏదో తెలీని ఆందోళన నన్ను వేధిస్తోంది” అనేది ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్ మానసిక కష్టం. నిజానికి.. ఇదొక సున్నితమైన అంశం. కానీ.. దీన్నొక మానసిక రోగంగా భావిస్తూ కుమిలిపోవడమే ఇక్కడ మరింత తీవ్రమైన అంశం. పని ఒత్తిడి కారణంగా ఏర్పడే సాధారణ రుగ్మతలే ఇవన్నీ! కేవలం స్వాంతన చేకూర్చే నాలుగు మంచి మాటలతో నయమవుతాయన్నది వాస్తవం.  కాకపోతే.. విస్మరించినకొద్దీ ఇవి బైపోలార్ డిప్రెషన్‌ అనే తీవ్రమైన  ఆందోళనకు దారితీయవచ్చట.

ఈ క్రమంలోనే.. బెంగళూరుకు చెందిన White Swan Foundation అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. కొన్ని ఐటీ కంపెనీల యాజమాన్యాల్ని సంప్రదించడం ద్వారా.. వాళ్ళ కార్యాలయాల్లో ఇటువంటి మానసిక ఒత్తిడితో బాధపడే వాళ్ళ జాబితాల్ని సేకరించి గోప్యంగా ఉంచింది. సైకాలజిస్టులతో రెగ్యులర్‌గా కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహిస్తూ.. వాళ్ళను ప్రెజర్ నుంచి బైటపడేసి.. మామూలు మనుషులుగా మార్చి.. వాళ్ళనుంచి సాధారణం కంటే ఎక్కువ ఉత్పాదక శక్తిని రాబట్టేలా చేస్తోంది. మరికొన్ని కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. సదరు HR విభాగాలు.. తమతమ ఉద్యోగులకు White Swan Foundation ద్వారా సరికొత్త వృత్తి జీవితాల్ని ప్రసాదిస్తున్నాయి.  అయినా.. వర్క్ ప్లేస్‌లో ఏర్పడే ఒత్తిళ్లనేవి ఎవరికైనా తప్పేవి కావు. ఎంతోకొంత మానసిక దారుఢ్యం ఉంటే తప్ప ఈ దినసరి కష్టం నుంచి కోలుకోవడం కష్టం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *