‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీకీ, వైసీపీకీ మధ్య వుండే సంబంధం ఎటువంటిది? బాలయ్య తీస్తున్న ‘ఎన్టీయార్’ బయోపిక్‌కి కౌంటర్‌గానే వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ తీయించారా? అనే సందేహం రోజురోజుకీ బలపడుతూనే ఉంది. భారీ బడ్జెట్ మూవీ కాదు కనుక.. దీనికైన ఖర్చు జగన్ ఖజానా నుంచే రిలీజ్ అయిందన్న వాదనలో ‘పస’ లేదు. ఇటు.. ఈ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నేత కావడంతో.. పరోక్ష సంబంధమే తప్ప.. ఇందులో జగన్ ప్రమేయం లేదని పార్టీ అనధికార వర్గాలు చెబుతూ వస్తున్నాయి. పైగా.. నిర్మాత రాకేష్ రెడ్డి జగన్‌తో కలిసున్న ఫోటోని డైరెక్టర్ వర్మ సోషల్ మీడియాలో పెట్టేశాడు.

చంద్రబాబును, తెలుగుదేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాల్లో వున్న వైసీపీ.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ నుంచి కూడా వీలైనంత ఎక్కువ లబ్ది పొందాలని ప్లాన్ చేస్తోంది. వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ మూవీ పెద్దగా పొలిటికల్ మైలేజ్ సాధించిపెట్టకపోవడంతో.. ఇప్పుడు జగన్ శిబిరం ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మీద దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే.. వెన్నుపోటు పాట, ట్రైలర్‌తో చంద్రబాబు నైజాన్ని ఎండగట్టేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో డైరెక్టర్ వర్మ మరింత ఎలర్ట్ అయ్యాడు. ‘కెలుకుడు’ ద్వారా మాత్రమే సినిమాని ప్రమోట్ చేసుకునే అలవాటున్న వర్మ.. లక్ష్మీస్ ఎన్టీయార్ కోసం ఆ ‘ప్రయత్నాల్లో’ బాగా బిజీ అయ్యారు. వైసీపీ నేత అంబటి రాంబాబుతో వర్మ భేటీ అయ్యారన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం. హైదరాబాద్ పార్క్ హయత్  హోటల్‌లో జరిగిన ఈ రహస్య భేటీ సారాంశం ఏమిటన్నది తెలియాల్సి వుంది. వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ జనవరి 25న విడుదల కానుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *