ఏడాదిన్నర కిందటి ఒక కీలక రాజకీయ అంశాన్ని డైరెక్టర్ వర్మ బాగా కెలికేశాడు! 2017 జులై రెండో వారంలో ప్రధాని మోదీ, వైసీపీ నేత లక్ష్మి పార్వతి మధ్య జరిగిన భేటీని సరైన సమయంలో గుర్తు చేసి.. తెలుగు రాజకీయాల్లో మరో సెన్సేషన్‌కి తెరతీశాడు. నాటి ‘మోదీ-లక్ష్మీ’ ఫోటోను ట్విట్టర్లో పెట్టిన వర్మ.. ఈవిధంగా తన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ని ప్రమోట్ చేసుకోవాలని ప్లాన్ చేసి వుండొచ్చు. కానీ.. రాజకీయపరంగా కూడా ఈ ఫోటోని ‘టైమ్‌లీ’ షాట్‌గా చెప్పుకోవచ్చు.

తెలుగుదేశం- బీజేపీల మధ్య కటీఫ్ ఖాయమన్న వార్తలతో ఏపీ రాజకీయం వేడిక్కినప్పటి ఫోటో ఇది. సీఎం చంద్రబాబుకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ.. లక్ష్మీపార్వతికి మాత్రం ఆయాచితంగా టైమ్ కేటాయించారు. ఎన్టీయార్‌కి భారతరత్న పురస్కారం అడగడం కోసమే ఆ భేటీని ఉపయోగించుకున్నట్లు చెప్పుకున్నారు లక్ష్మీపార్వతి. కానీ.. బాబు-మోదీల మధ్య అగాధానికి అక్కడే అంకురార్పణ జరిగిందని, లక్ష్మికి అపాయింట్‌మెంట్ ఇప్పించడంలో చొరవ చూపింది కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేనని అప్పట్లో వార్తలొచ్చాయి.

మోదీని చంద్రబాబుకు దూరం చేసి, జగన్‌కి దగ్గర చేయడంలో లక్ష్మీపార్వతి అక్కడే పావులు కదిపినట్లు కొన్ని మీడియాల్లో బ్రేకింగ్స్ కనిపించాయి. ఇప్పుడు.. వైసీపీ బీజేపీతో అంటకాగుతోందనడానికి ఈ పాత ఫోటో ఒక నిలువెత్తు సాక్ష్యంగా టీడీపీ వాదిస్తోంది. బాబు మీద చాడీలు చెప్పి మోదీ మనసు మార్చిన శిఖండి అంటూ లక్ష్మీపార్వతి మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే.. ఎన్టీయార్ మరో అల్లుడు దగ్గుబాటి వైసీపీకి చేరువయ్యారు. ఆయన భార్య పురందేశ్వరి బీజేపీలో వున్నారు. వర్మ పోస్ట్ చేసిన ఈ తాజా మాజీ ఫోటో ‘వైసీపీ-బీజేపీ’ల నిగూఢ బంధాన్ని బాగా ఎక్స్‌పోజ్ చేస్తోందన్నది వాస్తవం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *