ఈసారి ఆస్కార్ పండగ.. అనూహ్యంగా పొలిటికల్ రంగు పులుముకుంది. కొడక్ థియేటర్లో అట్టహాసంగా జరిగిన అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవంలో అమెరికన్ రాజకీయం ప్రస్తావనకొచ్చి.. సహజంగానే అనంతర వాతావరణం వేడెక్కిపోయింది. ‘అమెరికాలో ఎన్నికలొస్తున్నాయి.. ఈ సారైనా తెలివిగా ఓటెయ్యండి’ అంటూ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ స్పైక్ లీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రభావమే ఇదంతా. BlacKkKlansman అనే మూవీకి అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు అందుకున్న లీ.. ఆ సందర్భంగా అదే వేదిక మీద గంభీరమైన ప్రసంగం చేశారు. అగ్రరాజ్యంలో బానిసత్వపు రోజుల్ని గుర్తు చేసుకున్నారు. లోకల్స్ సాగించిన దమనకాండను, మారణహోమాల్ని ప్రస్తావిస్తూ ఉద్వేగంతో ఊగిపోయారు. ”2020 ఎన్నికల్లోనైనా మంచి ప్రభుత్వాల్నిఎన్నుకుందాం. ప్రేమకు-ద్వేషానికి మధ్య నిలబడి నైతికపరంగా మంచి నిర్ణయం తీసుకుందాం” అన్నారు.

స్పైక్ లీ ఇచ్చిన సూచన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భుజాలు తడుముకోక తప్పలేదు. ‘స్పైక్ లీ పునరాలోచన చేసుకోవాలి. అమెరికన్ ప్రెసిడెంట్లలో… నల్లవాళ్ళకు నాకంటే ఎక్కువ మేలు ఎవరూ చేయలేదు..’ అంటూ ట్వీట్ చేశారు. క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలు, నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టడం, పన్ను మినహాయింపులు.. ఇవన్నీ నా చలవే కదా..? అన్నది ట్రంప్ ఇచ్చుకున్న సమర్ధన. ఏదేమైనా.. ఆస్కార్ లాంటి గ్లోబల్ వేదిక మీద దర్శకరత్న చేసిన ప్రసంగం.. ట్రంప్ మీద ప్రపంచవ్యాప్తంగా మరింతగా వ్యతిరేకతను పెంచింది.

నిజానికి.. ట్రంప్ మీద ఇప్పటికే ‘జాత్యహంకారి’ అనే ముద్ర పడింది. తాను రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉండగానే ఇళ్ల నిర్మాణం విషయంలో నల్లవాళ్లపై వివక్ష చూపేవాడు. ప్రెసిడెంట్‌గా ఎన్నికై వైట్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. మసాచుసెట్స్ సెనేటర్‌గా వున్న ఎలిజబెత్ వారెన్‌ని పట్టుకుని.. వేశ్య అనేసినప్పుడు.. మెక్సికన్ వలసదారుల మీద రేపిస్టులుగా, నేరస్తులుగా ముద్రలేసినప్పుడు, హైతి-ఆఫ్రికన్ దేశాలను మురికికూపాలన్నప్పుడు ట్రంప్‌లో అంతులేని రేసిజమే కనిపించింది. అందుకే.. ట్రంప్ లాంటి జాత్యహంకారికి ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పండి అంటూ పిలుపునిచ్చాడు స్పైక్ లీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *