ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో నేతలు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. తాజాగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంపై అందరిదృష్టి కేంద్రీకృతమైంది. టీడీపీ నుంచి ఈ సీటు కోసం ఎవరు పోటీ చేయనున్నారనే దానిపై సాయంత్రంలోగా తేలిపోనుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మైదుకూరు సీటుపై స్పష్టత రానుంది. డీఎల్‌కు సీటు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

కాకపోతే ఈ సీటు తనకు కావాలని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ పట్టుబడుతున్నట్టు సమాచారం. పుట్టా కోసం యనమల కూడా తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి 2014 ఎన్నికల ముందు డీఎల్ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికారు. అప్పుడే టీడీపీలో చేరాలని ఆయన ప్రయత్నించారు. మైదుకూరు సీటు విషయంలో సుధాకర్ యాదవ్ అడ్డురావడంతో డీఎల్ చేరిక నిలిచిపోయినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన పుట్టా.. వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే!