పొరబాటు జరిగింది..సారీ !

కోట్లాదిమంది యూజర్ల పర్సనల్ డీటైల్స్ లీక్ అయ్యాయంటూ ఫేస్ బుక్ పై కొన్ని రోజులుగా వెల్లువెత్తిన ఆరోపణలమీద దీని సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచడంలో కంపెనీ నుంచి పొరబాటు జరిగిందని అంగీకరిస్తూ.. తమ మిస్టేక్ ని సరిదిద్దుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా డెవలపర్లు, భాగస్వాములతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పని చేసిన కేంబ్రిడ్జి అనలిటికా..అయిదు కోట్లమంది ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఫేస్ బుక్ పై విమర్శలు చెలరేగాయి. ఇప్పటికే అమెరికాలోని శాన్ జోస్ కోర్టులో కేసు కూడా నమోదైంది. అటు-అవసరమైతే యూఎస్ కాంగ్రెస్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జుకర్ బర్గ్.. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. భారత్ తో బాటు బ్రెజిల్ ఎన్నికల్లో ఫేస్ బుక్ యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..కేంబ్రిడ్జి అనలిటికా బోర్డు తమ సీఈవో అలెగ్జాండర్ నిక్స్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.