అమెరికా వైద్య రంగంలో ఇప్పుడొక వికృతమైన ట్రెండ్ నడుస్తోంది. అక్కడి జనమంతా ‘యువరక్తం’ కోసం వెంపర్లాడుతున్నారు. యుక్తవయస్కుల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించుకోవడం ద్వారా.. వార్ధక్యం రాదని, అల్జీమర్స్ లాంటి వ్యాధుల బారిన పడబోమని ఒక వదంతి అక్కడ పాకిపోయింది. సరిగ్గా ఇదే గ్యాప్‌లో అనేక ఆస్పత్రులు దీన్ని మరింత వేలంవెర్రిగా మార్చి ‘బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్’ చేస్తాం రండి.. ఎప్పటికీ నవయౌవనంతో వుండండి.. అంటూ దండోరా వేస్తున్నారు. వేలకొద్దీ డాలర్లు దండుకుంటున్నారు. డ్రాక్యులా ట్రాన్స్‌ఫ్యూజన్స్ పేరిట ఈ ఖరీదైన రక్తమార్పిడి ఒక ట్రెండ్‌గా మారిపోయిందక్కడ.

అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అప్రమత్తమైంది. యంగ్ బ్లడ్ మీద జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ అడ్వైజరీ విడుదల చేసి జనంలో అవగాహన కోసం ప్రయత్నిస్తోంది FDA. నిజానికి.. వయసు మళ్లడాన్ని నివారించే అరుదైన లక్షణాలు యుక్త వయస్కుల రక్త కణాల్లో ఉన్నట్లు ఇటీవల కొన్ని పరిశోధనలు తేల్చేశాయి. కొన్ని జంతువుల మీద ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగి.. సక్సెస్ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ..ఈ అధ్యయనాలు ఇంకా ఆమోదం పొందలేదని, మరింత లోతైన రీసెర్చ్ చేయాల్సిన అవసరం వుందని FDA చెబుతోంది.

ఎంగర్ బ్లడ్‌తో కలిగే బెనిఫిట్స్ ఫలానా అంటూ నిర్దిష్టమైన రుజువులు ఇంకా కలగలేదు కనుక.. రక్తమార్పిడి కోసం ఆవేశపడొద్దు అని సూచిస్తున్నారు. కానీ.. ఇప్పటికే.. లీటరు యువరక్తం 8 వేల డాలర్లు అంటూ ఒకరకమైన వ్యాపార దందా షురూ అయిందక్కడ. లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని కొన్ని క్లినిక్స్ మీద నిఘా పెట్టి ఈ వేలంవెర్రికి చెక్ పెట్టేశారు అధికారులు. అధికంగా రక్తం కోల్పోయిన పేషేంట్లకు, లివర్ వ్యాధితో బాధపడేవాళ్ళకు, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలకు యువ రక్తం వాడడం ప్రయోజనకరమని రుజువైన మాట వాస్తవం. అల్జీమర్స్, పార్కిన్సన్ లాంటి జబ్బుల నివారణకు సైతం యంగ్ బ్లడ్ దోహదపడుతుందన్నది మాత్రం పుకారేనట!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *