యాత్రల మీద ఆసక్తితో.. ప్రపంచం చుట్టేయాలన్న యావ కలిగిన వాళ్లకు బోర్ కొట్టకుండా.. ఎకో టూరిజం అనే సరికొత్త ట్రావెల్ ట్రెండ్ పుట్టుకొచ్చింది. పర్యావరణం మీద అవగాహన పెంచుకోవడంతో పాటు ‘మరో ప్రపంచాన్ని’ చూశామన్న అరుదైన అనుభూతి కలగడం ఎకోటూరిజం లక్ష్యం. సంస్కృతీ సంప్రదాయాల ఉనికిని కాపాడ్డం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కోసం ఎకోటూరిజం ట్రెండ్ పదికాలాల పాటు పచ్చగా ఉండాల్సిందే! పర్యాటక ప్రేమికుల పాలిట స్వర్గధామం లాంటి థాయిలాండ్ దేశంలో మచ్చుకు ఐదు ఎకోటూరిజం స్పాట్స్ పరిశీలిద్దాం.

  • గిబ్బన్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్

థాయ్‌ల్యాండ్‌లోని చిట్టచివరి రెయిన్ ఫారెస్ట్ వున్న ఫుకెట్ ప్రాంతంలో ఉందీ గిబ్బన్ ప్రాజెక్ట్. జనావాసాల్లోకి వచ్చిన జంతువుల్ని అక్కున చేర్చుకుని, తాత్కాలిక పునరావాసం కల్పించి మళ్ళీ వాటిని వాటి ‘స్వస్థలాలకు’ క్షేమంగా చేర్చడమే ప్రాజెక్ట్ థీమ్.1992 నుంచి ఈ రకమైన జంతు సేవలో తరిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక్కడికొచ్చే పర్యాటకులు కూడా తమకు తోచిన ఏదో ఒక జంతువును దత్తత తీసుకుని దాని సంక్షేమానికి పాటుపడవచ్చట.


  • ట్రాష్ హీరో థాయిలాండ్

థాయ్‌ల్యాండ్‌లోని ఒక ఔత్సాహిక కుర్రకారు సమూహం పేరే ‘ట్రాష్ హీరో థాయిలాండ్’. తమతమ వీకెండ్స్‌ని పర్యావరణం, పరిశుభ్రత కోసం వెచ్చించాలన్న సంకల్పమే వీళ్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. ‘ట్రాష్ హీరో థాయిలాండ్’ గ్రూప్‌లో చేరి స్వచ్ఛంద సేవ చేస్తూ.. సరికొత్త కమ్యూనిటీస్‌తో మమేకం కావడానికి అక్కడికొచ్చే పర్యాటకులు పోటీ పడతారు. ఎకో టూరిజంలో ఇదొక లోకల్ ట్రెండ్‌గా మారిపోయింది.


  • న్యూ హెవెన్ రీఫ్ కన్సర్వేషన్ ప్రోగ్రాం

మెరైన్ సర్ఫింగ్ మీద ఆసక్తి గల టూరిస్టులు ఎవరైనా.. థాయ్‌ల్యాండ్ వెళితే.. సముద్రగర్భంతో ఒక ఆట ఆడుకునే అవకాశమే ‘న్యూ హెవెన్ రీఫ్ కన్సర్వేషన్ ప్రోగ్రాం’. ఒక రోజంతా సాగర మథనం చేసి.. సముద్ర గర్భంలోకెళ్ళి అక్కడి పగడాల సంపదను పునరుద్ధరించడం అనేది ఒక హాబీ. మనకున్న సమయాన్ని ఓపికని బట్టి మూడునెలల పాటు అక్కడే ఉండగలిగే ఇంటర్న్‌షిప్ ఛాన్స్ కూడా ఉందట. చిట్టిపొట్టి తాబేళ్లను పొదుగు పెట్టడం లాంటి సరదాల్ని కూడా తీర్చుకోవచ్చు.


  • సాయ్ డాగ్స్ ఫౌండేషన్

థాయ్‌ల్యాండ్ దేశంలో ఏకంగా 85 లక్షల వీధి కుక్కలున్నట్లు అంచనా. వీటి సంఖ్యను అదుపులో పెట్టడం అనేది థాయ్ ప్రభుత్వ సవాళ్లలో ఒకటి. కుక్కల్ని విషమిచ్చి చంపడం లేదా, మాంసాహారులకు అప్పజెప్పడం.. ఇది మాత్రమే మొన్నటిదాకా అక్కడ అమలయ్యే నిర్మూలన ప్రణాళిక. కానీ.. Soi Dog Foundation అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఈ సమస్యకు మానవతా దృక్పథంతో ఒక పరిష్కారం కనిపెట్టింది. వీధి కుక్కలకు షెల్టర్ ఇచ్చి, వాటిలో సాధు స్వభావాన్ని ఏర్పరిచి, పెంపుడు జంతువులుగా ఎవరికైనా అప్పజెప్పడం ఈ ఫౌండేషన్ యాక్షన్ ప్లాన్. ఇందులో పాలుపంచుకునేందుకు థాయ్ టూరిస్టులు ఉత్సాహం చూపుతున్నారు.


  • కో యో హోమ్ స్టే

థాయ్‌లోని కోయో ద్వీపంలోని ఈ గ్రామం.. టూరిస్టులకు ఒక బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ కమ్యూనిటీకి జీవనాధారమైన కొన్ని వృత్తుల్లో టూరిస్టులు కూడా ఒక చెయ్యేసి.. అక్కడి వాళ్ళకు ఆర్ధిక చేయూతనివ్వవచ్చట. చేపలు పట్టడం, పంట సాగు, చేనేత లాంటి పనుల్లో స్థానికులకు తోడ్పాటునిచ్చి.. వాళ్ల బంగారు భవిష్యత్తుకు మార్గం వేయడంలో సాయం చేయవచ్చట. ఇదొక ఎకోఫ్రెండ్లీ స్ట్రాటజీ.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *