ఇప్పటికిప్పుడే బైటికెళ్లి ఒక ఐస్‌క్రీమ్ తిని రావాల్సిందే..! రేప్పొద్దున్నే చీజ్ దట్టించిన మంచి బర్గర్‌ని పట్టు పట్టాల్సిందే..! అన్నం తినగానే కనీసం నాలుగు అరటిపండ్లు మింగేయ్యాల్సిందే..! ఇటువంటివన్నీ ఆకలితో ప్రమేయం లేని ఆహారపుటలవాట్లు. ఇంతకీ.. తిండి మీద యావ పెరగడం అనేది.. శరీరానికి మంచి చేస్తుందా ? లేక ఆరోగ్యాల్ని చెడగొడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనుషుల్ని బట్టి మారిపోతుందట! సదరు తిండిపోతు మగా లేక ఆడా? అనే అంశం ఇక్కడ కీలకం అంటున్నారు హార్మోన్ ఎక్స్‌పర్ట్స్. పైగా.. జిహ్వ చాపల్యం అనేది శరీర స్వభావాన్ని కూడా తేటతెల్లం చేస్తుందట.

ఉప్పగా వుండే పదార్థాలు తినాలనిపిస్తోందంటే.. మీలో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్లు..! పాల ఉత్పత్తులు కావాలనిపిస్తే కాల్షియం పాళ్ళు తగ్గినట్లు లెక్క. స్వీట్స్, కార్బో హైడ్రేట్స్ తో కూడిన తినుబండారాల కోసం మీరు ఎగబడుతున్నారంటే మీలో కొవ్వు శాతం తక్కువగా వున్నట్లు అంచనా. ఆడవాళ్ళ విషయానికొస్తే.. పీరియడ్స్ సమయంలో వాళ్లకు చాకోలెట్స్ మీద మనసు మళ్లుతుంది. వాళ్ళు తినాల్సిన ఆహారాన్ని వాళ్ళ హార్మోన్స్ కూడా గైడ్ చేస్తాయని స్పెషలిస్టులు చెబుతున్నారు.

నెలసరిలో ఆడవాళ్ళ హార్మోన్స్‌లో హెచ్చుతగ్గులు ఎక్కువగా వుంటాయి కనుక.. వాటినిబట్టి వాళ్ళ ఆహారపుటలవాట్లు వేగంగా మారిపోతుంటాయట. నెలలో రెండవ అర్థ భాగంలో ఆడాళ్ళలో మెటబాలిజం స్పీడ్ అందుకుంటుందని, ఆ సమయంలో వాళ్లకు మైక్రో న్యూట్రియెంట్స్, కెలొరీస్ అధికంగా అవసరం అవుతాయని చెబుతున్నారు. మగాళ్లలో ఎక్కువమంది సహజంగానే గ్లూటెన్, పాలు, పెరుగు, నెయ్యి, చక్కరతో కూడిన డ్రగ్-లైక్ ఫుడ్స్నీ, ప్రొసెస్డ్ ఫుడ్స్‌నీ ఇష్టపడతారట.

తిండి మీద అంతులేని ఆరాటం కలిగినపుడు.. దాన్నుంచి బైట పడాలా? లేక తింటూనే ఉండాలా అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న! నోటికి తోచిందల్లా తినెయ్యడం కాకుండా కాస్త సంయమనం పాటించడం అవసరమని మాత్రం సూచిస్తున్నారు. ఏఏ సమయాల్లో ఏమేం తింటే ఆరోగ్యకరమో చెప్పే MyFLO అనే యాప్‌ని ఫాలో కావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆడాళ్ళ రుతుక్రమం సమయంలో జిహ్వ చాపల్యాన్ని కాస్త అదుపులో పెట్టుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *