నిద్ర సమయంలో మనం పాల్పడే కొన్ని చేష్టల గురించి.. తెల్లారాక మిగతా వాళ్ళు చెబితే తప్ప మనకు తెలీదు. ఔనా అంటూ ఆశ్చర్యపోవడమే తప్ప మనం చేయదగ్గదేమీ లేదు కూడా. పడక మీద ఒద్దిగ్గా పడుకోవడం తెలీక పిల్లాపెద్దా అనేకమంది ఇబ్బందిపడడం సహజం. కొంతమంది ఒక వైపుకు ఒరిగి పడుకుంటే.. మరికొంతమంది పడక మీద నుంచి జారి కిందపడిపోవడం కూడా చూస్తుంటాం. ఇటువంటి దినసరి సమస్యలకు పరిష్కారం కనిపెడదామని ఫోర్డ్ సంస్థ ఒక చిన్న ప్రయత్నం చేసింది.

‘ఫోర్డ్’ అనేది ఆటోమొబైల్ సంస్థ. సహజంగా కార్ల ఉత్పత్తి మాత్రమే వాళ్లకు తెలిసింది. రోడ్డు వదిలి అటూఇటూ దారితప్పి స్టీరింగ్ మీద అదుపు కోల్పోయే డ్రైవర్ల కోసం ఉద్దేశించిన ‘లేన్ సెంట్రింగ్’ థీమ్‌ని ఉపయోగించి.. ఒక స్మార్ట్ బెడ్ తయారు చేసింది ఫోర్డ్ కంపెనీ. Lane-Keeping కాన్సెప్ట్‌తో పుట్టిన ఈ పరుపులో.. పడుకున్న వారి కదలికల్ని గుర్తించగలిగే ప్రెజర్ సెన్సార్స్ ఉంటాయట. నిద్రలో అనుకోకుండా కొనకు చేరినప్పుడు వాళ్ళను మళ్ళీ యథాస్థానానికి లేదా మధ్యలోకి జరపడమే ఈ స్మార్ట్ బెడ్ డ్యూటీ.

ఇందులో అమర్చిన కన్వేయర్ బెల్ట్ ఆటోమేటిక్‌గా ముడుచుకుని.. తద్వారా.. పడుకున్న వాళ్ల ప్లేస్‌మెంట్‌ని సరిచేస్తుంది. ముఖ్యంగా.. దంపతులకు ఈ స్మార్ట్ బెడ్ బాగా ఉపకరిస్తుందని, ఒకరికొకరు దూరంగా జరిగినప్పుడు.. యాంత్రికంగానే వాళ్ళ మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేర్చుతుందని చెబుతున్నారు. ఇద్దరి మధ్య దాంపత్య బంధం గట్టిపడ్డానికి ఈ స్మార్ట్ బెడ్ దోహదం చేసే అవకాశం వుంది. నిజానికి.. ఈ స్మార్ట్ బెడ్‌కి సంబంధించి ప్రోటోటైప్ మాత్రమే సిద్ధమైంది. దీన్ని పూర్తిస్థాయిలో డెవలప్ చేసి మార్కెట్లో పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదన్నది ఫోర్డ్ ఇంజనీర్ల మాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *